AP POLITICS: దేశ వ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో హవా కొనసాగిస్తున్న ఎన్టీఏ కూటమి దక్షణాది రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తిష్ట వేసేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తుంది కమల దళం. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తొక్కేసి కమలాన్ని వికసింపజేస్తున్నారు. ఇప్పటికే జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపి ముచ్చటగా మూడోసారి వెముగోడులో బీజేపీ జెండాను పాతేందుకు సిద్దం అవుతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ హవా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఇక వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీని బుట్టలో వేసుకునేందుకు కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది.

వైసీపీ ప్రధాన కార్యదర్శి, వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పార్లమెంటులో మరో కీలక పదవి దక్కింది. రవాణా, సాంస్కృతిక, పర్యాటక శాఖలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి ఆయన చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ హోదాలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది,
ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా ప్రకటించారు. ఈ కమిటీలో ఉపరితల రవాణా, పౌర విమానయానం, నౌకాయానం, పర్యాటకం, సాంస్కృతిక శాఖలకు చెందిన అంశాలు ఉంటాయి. ఈ కమిటీకి తనను చైర్మన్‌గా నియమించిన ధన్‌కడ్‌తో పాటు తనపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక పార్టీ నుంచి తనను ఈ పదవికి ఎంపిక చేసిన జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.