ఏపీలో వైసీపీ పార్టీతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అన్నయ్య గెలుపు, ప్రజల నుంచి జగన్ కి వచ్చిన ఆదరణని చూసిన వైఎస్ షర్మిల కూడా ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటుంది. దీనికి ఏపీని కాకుండా తెలంగాణని వేదికగా మార్చుకుంది. వైఎస్ఆర్టీపీ పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టి ప్రజలలోకి బలంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆరంభంలో షర్మిలకి ఆశించిన స్థాయిలో ప్రజా మద్దతు రాలేదు. కాని ఇప్పుడిప్పుడే ఆమెపై మీడియా ఫోకస్ పెరిగింది. అలాగే టీఆర్ఎస్ పార్టీ కూడా షర్మిలని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. ఇక తండ్రి బాటలోనే తాను కూడా ప్రజల మద్దతు పెంచుకోవడానికి పాదయాత్ర మొదలు పెట్టింది.
ఇక గత కొద్ది రోజుల నుంచి వైఎస్ షర్మిల పాదయాత్రకి ప్రభుత్వం నుంచి ఆటంకం ఏర్పడుతుంది. వైఎస్ షర్మిల వ్యక్తిగత విమర్శలు చేస్తూ శాంతిభద్రతలకి విఘాతం కలిగిస్తుందనే అంశాన్ని ప్రభుత్వం, పోలీసులు తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపధ్యంలో హై కోర్టు నుంచి ఆమెకి అనుమతులు ఉన్నా కూడా పోలీసులు మాత్రం ఇవ్వడం లేదు. దీనిపై ఆమె కొద్ది రోజులుగా ఆమరణ దీక్ష అంటూ నిరసన చేసింది. అదే సమయంలో తన పాదయాత్రని ప్రభుత్వం కావాలని అడ్డుకుంటుందని, పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించింది. ఇక తాజాగా హైకోర్టు నుంచి కూడా ఆమె పాదయాత్రకి రూట్ క్లియరెన్స్ దొరికింది. పాదయాత్ర చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.
అయితే పాదయాత్రలో భాగంగా అధికార పార్టీపైనగాని, లేదంటే ఇతర పార్టీలపైన గాని రాజకీయ వైఫల్యాలపై తప్ప వ్యక్తిగత విమర్శలు చేయకూడదని ఆదేశించింది. వ్యక్తిగత విమర్శలు లేకుండా పాదయాత్ర చేసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని ధర్మాసనం పేర్కొంది. దీంతో వైఎస్ షర్మిల పాదయాత్ర చేయడానికి సిద్ధం అవుతుంది. ఇక పాదయాత్రకి అనుమతి లభించడంతో తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా వైఎస్ తనయ ప్రకటించింది. రాబోయే ఎన్నికలలో పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని షర్మిల తెలియజేసింది.
త్వరలో నియోజకవర్గంలో పర్యటించి పార్టీ కార్యాలయానికి కూడా భూమి పూజ చేయబోతున్నట్లు తెలిపింది. పాలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కి మంచి పట్టు ఉంది. అలాగే ఆంధ్రా సరిహద్దు కావడంతో ఓటుబ్యాంకు తనకి కలిసి వస్తుందని వైఎస్ షర్మిల భావిస్తున్నారు. మరి పాలేరు నియోజకవర్గంలో ఆమె ఏ స్థాయిలో ప్రజా మద్దతు సొంతం చేసుకొని తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెడుతుంది అనేది తెలియాల్సి ఉంది.