ఏపీలో ప్రస్తుతం రాజకీయ పార్టీలు కులాల ప్రాతిపాదిక మీద విడిపోయాయి. అయితే కాపులు అందరూ పవన్ కళ్యాణ్ ని తమ నాయకుడుగా అనుకుంటున్నారు. దానిని వైసీపీలో ఉన్న కాపు నేతలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. నేరుగానే సభలు, మీడియా మీట్ లలో పవన్ కళ్యాణ్ పై చెప్పలేని భాషలో విషం కక్కుతున్నారు. ఇష్టారీతిలో రెచ్చిపోతున్నారు. తాజాగా అంబటి కూడా ఓ సభలో పవన్ కళ్యాణ్ మీద పరుష పదజాలంలో రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ ని తనని విమర్శించే అర్హత లేదని, వాడు ఏమైనా మగాడా అంటూ ఘాటుగా విమర్శించారు. పేర్ని నాని అయితే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పై పనిగట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేస్తూ ఉంటారు. అలాగే మంత్రి దాడిశెట్టి రాజా, అమర్ నాథ్ కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు.
అయితే రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కారణంగా తమకి ఓటమి తప్పదని గ్రహించే వీళ్ళు అసహనం వెళ్లగక్కుతున్నారని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. ఇదిలా ఉంటే కాపుల రిజర్వేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాపులకి రిజర్వేషన్ ఇవ్వకుండా ఏవో చెప్పి తప్పించుకున్న జగన్ ని కేంద్ర ప్రభుత్వం ఇరుకున పెట్టింది. రిజర్వేషన్ అనేది రాష్ట్ర పరిధిలో అంశమే అని తేల్చేసింది. ఈ నేపధ్యంలో కాపుల నుంచి తిరుగుబాటు మొదలవుతుందని గ్రహించిన జగన్ టీమ్ ముద్రగడతో లేఖ రాయించింది. అయితే ఈ లేఖలో పేద కాపులు అని ముద్రగడ చెప్పడం, ఆదరికి ఇవ్వగా మిగిలింది మాకు ఇవ్వండి అని బ్రతిమలాడుకోవడం, అలాగే ఏదో ముష్టి వేయండి అన్నట్లు చెప్పడం కాపు నేతలకి అస్సలు రుచించడం లేదు.
దీంతో ముద్రగడ లేఖపై విమర్శలు ఎక్కువయ్యాయి. కాపులు అందరూ జగన్ కి పాలేకాపులు అన్నట్లు ముద్రగడ లేఖ ఉందని, అతని కొడుకుకి ఎమ్మెల్యే సీటు ఇప్పించుకోవడానికి కాపులు అందరిని అవమానించే విధంగా లేఖ రాయడంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ముద్రగడని పక్కన పెట్టి కాపులు అందరూ ఏకం అయ్యేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. టీడీపీలో ఉన్న కాపు నాయకులు కూడా కాపుల రిజర్వేషన్ అంశానికి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది.