పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏ క్షణాన ఈ రోజు కలిసి మాట్లాడుకోవడం మొదలు పెట్టారో కాని ఏపీలో అందరికంటే ఎక్కువగా టెన్షన్ పడింది మాత్రం వైసీపీ నాయకులే అని అర్ధం అవుతుంది. ఉదయం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిసిన సమయం నుంచి వైసీపీ నాయకులు ట్విట్టర్ లో, చానల్స్ లో అదే పనిగా పవన్ కళ్యాణ్ మీద విమర్శల దాడి చేస్తున్నారు. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ మీద చేసే ప్యాకేజీ విమర్శలు సరా మామూలుగానే చేయడం విశేషం. ముఖ్యంగా పవన్, చంద్రబాబు కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తే ఎవరి స్థానాలు అయితే గల్లంతు అవుతాయని అందరూ భావిస్తున్నారో ఆ నాయకులే మీడియా ముందుకొచ్చి తమ కోపాన్ని వెళ్లగక్కారు. అంబటి రాంబాబు, అమర్ నాథ్ ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు.
మార్గాని భరత్ అయితే ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నోరుపారేసుకున్నాడు. అలాగే మల్లాది విష్ణు, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, రోజా అందరూ మూకుమ్మడిగా ఒకరి తర్వాత ఒకరు పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం విశేషం. అయితే వీరిలో ఎవరూ కూడా చంద్రబాబు మీద గట్టిగా విమర్శలు చేయకపోయిన పవన్ కళ్యాణ్ మీద మాత్రం ఇష్టారీతిలో రెచ్చిపోయారు. అలాగే జనసైనికులకి ఏదో అన్యాయం జరిగినట్లు మీడియా ముందుకి వచ్చి తెగ బాధపడిపోయారు. ఇక వైసీపీ సోషల్ మీడియా వింగ్ అయితే ఆగకుండా తమ అనుబంధ యుట్యూబ్ చానల్స్, అలాగే ట్విట్టర్, పేస్ బుక్ గ్రూప్స్ లో ఎక్కడలేని ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ ఉండటం విశేషం. ఇవన్ని చూస్తుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలయిక వారిని ఎంత భయపెట్టిందో అర్ధం చేసుకోవచ్చని జనసైనికులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
వారిద్దరి కలయిక వలన రాత్రి వైసీపీ నాయకులకి నిద్ర కూడా పట్టదేమో అంటూ ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియా టీమ్ అయితే ప్యాకేజీ స్టార్ పీకే అంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ని కూడా వైరల్ చేస్తుంది. ఇన్ని రోజులు ఏదో ఒకటి చేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగ్గర కాకుండా చేయాలని వైసీపీ వేస్తున్న వ్యూహాలకి పవన్ కళ్యాణ్ ఒక్క మీటింగ్ తో ఫుల్ స్టాప్ పెట్టేసాడనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. వీరిద్దరి కలయిక వైసీపీని చాలా భయపెడుతుందనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.