ఏపీలో ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా వెళ్లి తమపై చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవడానికి అధికార పార్టీ వ్యూహాత్మకంగా జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 1తో ప్రతిపక్షాలపై వైసీపీ పోలీసులని ఉపయోగించుకొని ఆంక్షలు విధిస్తుంది. ముఖ్యంగా జనసేన, టీడీపీ చేసే ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలని అడ్డుకోవడమే ధ్యేయంగా చట్టాన్ని ఉపయోగించుకొని వైసీపీ ఆడుతున్న ఈ రాజకీయ ఆట తిరిగి ఆ పార్టీపైనే బస్మాసుర హస్తం తరహాలో పడబోతుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. దీనికి బలమైన కారణం కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీ మున్ముందు ప్రతిపక్షాలపై ఈ చట్టాన్ని ఉపయోగించుకొని మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం అయితే ఉందనే మాట వినిపిస్తుంది.
ఇప్పటికే కుప్పంలో జీవో నెంబర్ 1 అమల్లో ఉన్న నేపధ్యంలో రోడ్ షోలకి పర్మిషన్ ఇవ్వలేమని పోలీసులు భారీగా మొహరించి అడ్డుకున్నారు. అయితే చంద్రబాబు రోడ్డు మీద ధర్నా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఇక ఈ నిరసన ఆ పార్టీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. దీనికి కారణం కుప్పం పర్యటనని చంద్రబాబు ముగించుకొని వచ్చిన రెండు రోజుల్లోనే మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో పర్యటించి రోడ్ షో కూడా నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలాగే వైసీపీ నాయకులు రోడ్ షోలు, ర్యాలీలు దర్జాగా చేసుకుంటున్నారు. ప్రతిపక్షాలు పర్మిషన్ కోసం ముందుగానే దరఖాస్తు చేసుకున్న వాటిని పెండింగ్ లో పెడుతున్నారు.
వాల్తేర్ వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా తీవ్ర ఆటంకం సృష్టించారు. ఇక జనవరి 12న శ్రీకాకుళంలో జరగబోయే పవన్ కళ్యాణ్ యువశక్తి సభకి కూడా ఆటంకం కలిగించే ప్రయత్నంలో అధికార పార్టీ ఉంది. ఏదో ఒక సమస్య చూపించి సభకి అవాతరం కలిగించాలని భావిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ యువశక్తి సభని ఎలా అయిన విజయవంతం చేయాలని చూస్తున్నారు. ఒక వేళ ఆ సభని అడ్డుకున్న, అలాగే తరువాత జరగబోయే పవన్ బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్రని ఆటంకం కలిసితే మాత్రం ప్రతిపక్షాలు హైకోర్టుకి వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవడంతో పాటు అధికార పార్టీ పెడుతున్న ఆంక్షలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే ఛాన్స్ ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అదే జరిగితే జీవో నెంబర్ 1 వైసీపీని రానున్న ఎన్నికలలో ఓడించే ప్రతిపక్షాల బ్రహ్మాస్త్రం అవుతుందనే టాక్ నడుస్తుంది.