విశాఖ కేంద్రంగా వైసేపీ ఏపీలో రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖని రాజధానిగా చేస్తున్నాం అంటూ ఉత్తరాంద్ర ప్రజలని గత మూడేళ్ళుగా నమ్మిస్తున్నారు. ఇక ఉగాది తర్వాత విశాఖ నుంచి పరిపాలన్ చేస్తామని గత రెండేళ్ళ నుంచి చెబుతున్నారు. అయితే అక్కడికి వెళ్ళడానికి మాత్రం ముఖ్యమంత్రి జగన్ సంకోచిస్తున్నారు. ఇక రాజధాని పేరుతో విశాఖలో భూదందాకి వైసీపీ నేతలు తెరతీసారనే విమర్శలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. అలాగే పేదల భూములని లాక్కునే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. మరో వైపు రుషికొండని విద్వంసం చేసి అక్కడ జగన్ శాశ్వత నివాసం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, సీఆర్డీఎ నిబంధనలు అలాగే పర్యావరణ అనుమతులు లేకుండా పచ్చని కొండలని నాశనం చేస్తున్నారని జనసేన టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే దీనిపై ఎన్ని రకాల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పోలీసుల సెక్యూరిటీ పెట్టుకొని అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. తాజాగా ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. అయితే రుషికొండపై నిర్మిస్తుంది ప్రభుత్వ భవనాలు అని వైసీపీ వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే విశాఖలో ఇప్పటికే రాజకీయాలు మొదలు పెట్టి అక్కడ ఫ్యాక్షన్ గొడవలు పెంచే ప్రయత్నం వైసీపీ చేస్తుందని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. ప్రశాంత విశాఖకి వైసీపీ నాశనం చేస్తుందని అంటున్నారు.
తాజాగా ఏయూని కూడా వైసీపీ రాజకీయాలకి వేదికగా మార్చుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏయూ వీసీ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే కొంత మంది విద్యార్ధి నాయకుల ముసుగులో యూనివర్సిటీలోకి ప్రవేశించి జగన్ ఫ్లెక్సిలు కట్టడం చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలని కూడా ఏయూలో విద్యార్ధి సంఘాలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశ్వవిద్యాలయాన్ని రాజకీయాల అడ్డాగా మార్చేసి అక్కడ స్టూడెంట్స్ చదువులకి భంగం కలిగిస్తున్నారు అంటూ టీడీపీ వారు విమర్శిస్తున్నారు.