కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనల నేపధ్యంలో వైసీపీకి టీడీపీను అడ్డుకోవడానికి కొన్ని ఆయుధాలు సిద్ధం చేసుకుంటుంది. బహిరంగ సభలు నిర్వహించే సమయంలో పోలీసులు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కారణం ఎక్కువ మంది జనాలు బహిరంగ సభలలో పాల్గొంటారు. అలాంటి సమయంలో అవాంచనీయ ఘటనలు జరగకుండా ఉండటానికి పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. అలాగే రోడ్ షో లలో కూడా తప్పనిసరిగా పోలీసుల పర్మిషన్ ఉండాలి. అయితే పెద్ద పెద్ద నాయకులు రోడ్ షోలు చేసే సమయంలో కొంత నియంత్రణ అవసరం ఉంటుంది. వేలాదిగా తరలివచ్చే అభిమానులకి అలెర్ట్ చేస్తూ ఉండాలి. అలాగే కొన్ని ప్రాంతాలలో అస్సలు రోడ్ షోలు నిర్వహించకూడదు.
అయితే తాజాగా జరిగిన రెండు తొక్కిసలాటలలో నైతికంగా టీడీపీ వైపు అధికార పార్టీ వేలెత్తి చూపిస్తుంది. ఇక వారం రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు జరగడంతో ప్రభుత్వం తమకి పోటీగా ఉన్న టీడీపీని ప్రచారాలని నియంత్రించడానికి ఇప్పుడు కఠిన ఆంక్షలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ఘటనలని బూచిగా చూపిస్తూ చంద్రబాబు జిల్లా ప్రచారాలపై కచ్చితంగా ఆంక్షలు పెడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రోడ్ షోలకి అనుమతి రద్దు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అలాగే పబ్లిక్ గ్రౌండ్ లలో తప్ప ఎక్కడ పడితే అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకి కూడా వైసీపీ తొక్కిసలాట ఘటనని చూపిస్తూ పర్మిషన్ పై ఆంక్షలు విధిస్తుందని భావిస్తున్నారు.
అలాగే లోకేష్ పాదయాత్రపై కూడా కఠిన ఆంక్షలు విధించబోతుందని సమాచారం. దీనిపై న్యాయ నిపుణులు, పోలీస్ అఫీషియల్స్ తో చర్చించి కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత లోకేష్ పాదయాత్ర అనుకుంటున్నారు కాబట్టి అప్పుడే ఆంక్షలు విధించే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఈ రెండు ఘటనల తర్వాత ప్రజలలో పబ్లిక్ మీటింగ్ లు, రోడ్ షోలపై కొంత నియంత్రణ ఉండాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపధ్యంలో ప్రజాభిప్రాయం, ప్రజా భద్రతని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.