టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జనవరి 21 నుంచి కుప్పం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పాదయాత్రకి యువగళం అనే పేరు పెట్టారు. ఇక ఈ పాదయాత్ర సుమారు 4000 కిలోమీటర్లు ఉంటుందని కూడా చెప్పారు. ఎన్నికల వరకు ఈ పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది. టీడీపీని అధికారంలోకి తీసుకొని రావడం కోసం లోకేష్ పాదయాత్ర మార్గాన్ని ఎంచుకోగా దీనికి వీలైనంత స్థాయిలో అడ్డంకులు సృష్టించడానికి వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది.
గతంలోనే వైసీపీ నాయకులు లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటామని, పాదయాత్ర వైఎస్ కుటుంబం పేటెంట్ హక్కు అని వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి పాదయాత్ర చేసే రైట్ లేదని కూడా అసందర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా లోకేష్ పాదయాత్ర పేరు ఖరారు చేసి బయటకి చెప్పిన తర్వాత వైసీపీ మంత్రులు విమర్శలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగా ముందుగా మంత్రి మేరుగ నాగార్జున రంగంలోకి దిగాడు. లోకేష్ పాదయాత్రని అడ్డుకొని తీరుతామని శపథం చేశారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు దళితులపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశారని, దీనిపై నారా లోకేష్ క్షమాపణలు అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకి రాయాలని డిమాండ్ చేశారు.
ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం ఏదో సందర్భంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలని మళ్ళీ మేరుగ నాగార్జున తెరపైకి తీసుకురావడం ద్వారా ఏదో ఒక అంశం పట్టుకొని పాదయాత్రకి ఆటంకం కలిగించడమే వైసీపీ లక్ష్యం అంటూ చెప్పకనే చెప్పారు. అయితే లోకేష్ పాదయాత్రకి వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఏదో ఒక రూపంలో ఆటంకం కలిగించడమే టీడీపీకి కూడా కావాల్సిందే.
అలా చేస్తే దానిని మీడియాలో ప్రాజెక్ట్ చేసి వైసీపీ అరాచక పాలనని మరింతగా ప్రజల దృష్టికి తీసుకెళ్ళే ఛాన్స్ ప్రతిపక్షాలకి దొరుకుతుంది. ఇది కచ్చితంగా టీడీపీకి పాజిటివ్ అవుతుంది. అయితే వైసీపీ మాత్రం అధికారాన్ని ఉపయోగించుకొని తమ కార్యకర్తల ద్వారా ఆటంకాలు సృష్టించి తరువాత పోలీసులతో ప్రజలు ఎవరూ పాల్గొనకుండా నిర్భంధించే యోచనలో ఉందనే మాట వినిపిస్తుంది.