ఏపీ రాజకీయాలలో పార్టీల సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. నిన్న, మొన్నటి వరకు ఎలా అయినా టీడీపీ, జనసేనని కలవకుండా చేసి మరోసారి భారీ మెజారిటీతో గెలుపొందాలని వైసీపీ అధినేత జగన్ ప్లాన్ చేశారు. దానిని అమలు చేసే బాద్యత మంత్రులకి అప్పగించారు. మరో వైపు ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో గ్రామ సారథులని సిద్ధం చేసుకుంటుంది. వారి సహాయంతో తమ సంక్షేమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తుంది. ఇప్పటికే దానిపై వర్క్ చేస్తుంది. ఈ గ్రామ సారథులే వైసీపీ విజయ రథసారథులు అవుతారని ఆ పార్టీ భావిస్తుంది. అయితే వీరిని గ్రామంలో సంక్షేమ పథకాలు పొందిన వారిని బెదిరించి, భయపెట్టి మళ్ళీ వైసీపీకి ఓటు వేసేలా కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.
వైసీపీకి ఓటు వేయకపోతే మళ్ళీ గెలిచిన వెంటనే మీ పెన్షన్ తొలగిస్తాం, సంక్షేమ పథకాలు రానివ్వం అంటూ బెదిరించే పద్ధతిలో వారిని నడపాలని చూస్తున్నట్లు టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఎలక్షన్స్ టైంలో కూడా వాలంటీర్ల స్థానంలో వారిని ఓటర్లని ప్రలోభపెట్టడానికి ఉపయోగించుకునే స్కెచ్ వేసినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు. ఇదే సమయంలో జనసేన, టీడీపీ బలపడకుండా, కలవకుండా చేసే పనిని మంత్రులు, ఎమ్మెల్యేలకి అప్పగించారు. అయితే ఒక్కసారిగా వైసీపీ ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీ, జనసేన జత కట్టే దిశగానే అడుగులు వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వేసిన ఈ ఎత్తుగడతో ఒక్కసారిగా వైసీపీ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాడి చేయడం మొదలు పెట్టింది. వారిది అపవిత్ర కలయిక అన్నట్లు ప్రోజక్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అది ఈ కలయిక ఇప్పుడు వైసీపీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలకి ఇబ్బందికరంగా మారింది. వీరు కలిసి పోటీ చేసే పక్షంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న రోజా, అమర్ నాథ్, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, జోగి రమేష్ లాంటి నేతల ఎమ్మెల్యే సీట్లకి జగన్ ఎసరు పెట్టె ఛాన్స్ ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.
దీనికి కారణం 2019 ఎన్నికలలో జనసేన విడిగా పోటీ చేయడం వలన వీరందరూ స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసిపోవడం వలన కచ్చితంగా వారు ఓడిపోయే అవకాశం ఉందని ఐ ప్యాక్ ఇచ్చిన సర్వే తెల్చేసినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో సామాజిక సమీకరణాలు తెరమీదకి తీసుకొస్తూ ఈ మంత్రులని పక్కన పెట్టి అక్కడ బలమైన వారికి సీట్లు ఇవ్వడానికి జగన్ సీక్రెట్ గా మంత్రాంగం నడుపుతున్నాడనే మాట వినిపిస్తుంది. దీంతో చంద్రబాబు, పవన్ కలయికతో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులలో చాలా మందికి టెన్షన్ మొదలైనట్లు సమాచారం. జగన్ తమకి మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడెమో అనే భయం వెంటాడుతుందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.