జీవో నెంబర్ 1ని అమల్లోకి తీసుకొచ్చి రోడ్ షోలు, ర్యాలీలపై అలాగే బహిరంగ సభలపైన వైసీపీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విపక్షాల నుంచి వ్యతిరేకత వస్తున్నా కూడా వైసీపీ సర్కార్ అస్సలు వెనక్కి తగ్గేది లేదు అనే విధంగానే మొండి వైఖరితో పోలీసులని ప్రయోగిస్తూ తమ విధానాన్ని కొనసాగిస్తుంది. నిషేధాన్ని కాదని రోడ్ షోలు చేయడానికి ప్రయత్నిస్తే ఎంత పెద్ద నాయకుడు అయినా సరే అదుపులోకి తీసుకోవాలని వైసీపీ సర్కార్ కూడా పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో కుప్పం పర్యటనలో చంద్రబాబుని రోడ్ షోచేయకుండా నిలువరించగలిగారు. అయితే చంద్రబాబు వ్యూహం మార్చి గ్రామ సభలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.
ఇదిలా ఉంటే జీవో నెంబర్ 1ని వ్యతిరేకిస్తున్న విపక్షాలపై అధికార వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తున్నారు. ప్రజల ప్రాణాలని రక్షించడం కోసమే రోడ్ షోలపై నిషేధం విధించామని చెబుతున్నారు. మరో వైపు చంద్రబాబు ఒక సైకో అంటూ, ప్రజల ప్రాణాలు అంటే అస్సలు లెక్కలేని నరరూప రాక్షసుడు అంటూ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పైన కూడా మంత్రి రోజా ఘాటుగా విమర్శలు చేశారు. మీ పర్యటనలని అడ్డుకోవాలని మేము అనుకుంటే అస్సలు మీరు ఏపీలో తిరగగలిగేవారు కాదని అన్నారు.
అలాగే ప్రజల ప్రాణాలు తీస్తూ పాదయాత్రలు, రోడ్ షోలు, బస్సుయాత్రలు చేస్తామంటే కచ్చితంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అనే విధంగా మంత్రులు మాట్లాడుతున్నారు. అయితే వైసీపీ అవలంబిస్తున్న ఈ విధానాన్ని ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. కేవలం ప్రతిపక్షాలని అణచివేయడానికి ఇలాంటి నిషేధాలు జగన్ రెడ్డి తీసుకొచ్చారని అంటున్నారు. మొత్తానికి పరోక్షంగానే తమ పంథా ప్రతిపక్షాలని నియంత్రించడమే అనే విషయాన్ని వైసీపీ నాయకులు చెప్పకనే చెబుతున్నారని రాజకీయ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు.