జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో బస్సు యాత్ర చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ఒక బస్సుని సిద్ధం చేశారు. ఈ బస్సుకి వారాహి అని పేరు పెట్టారు. దీనిని ట్విట్టర్ లో షేర్ చేసి వారాహి యుద్ధానికి సిద్ధం అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ వాహనం చూడగానే వైసీపీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరికి కొత్త హుషారు వచ్చినట్లు అయ్యింది. దీంతో చంద్రబాబు టూర్ తో పాటు ఆ పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాన్ని డైవర్ట్ చేయడానికి సోషల్ మీడియాలో వారాహిపై దాడి మొదలు పెట్టారు. వారాహి వాహనం ఆర్మీ వెహికల్స్ కలర్ ని పోలి ఉందని, ఆర్టీఐ చట్టాల ప్రకారం ఆర్మీ వాహనాలు ఉపయోగించే రంగుని ప్రైవేట్ వెహికల్స్ కి వాడకూడదని, కనీసం ఇది కూడా తెలియకుండా పవన్ ఎలా లక్ష పుస్తకాలు చదివేసిన జ్ఞాని అయిపోయారంటూ పేర్ని నాని విమర్శలు చేశారు.
అలాగే వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా వింగ్ కూడా రెండు రోజుల నుంచి అదే పనిగా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం మీద విమర్శలతో ఎటాక్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే జనసైనికుల నుంచి రివర్స్ కౌంటర్స్ ఉంటున్నాయి. ఇక నాయకులు అధిష్టానం చెప్పిన దారిలో పవన్ కళ్యాణ్ వాహనంపై విమర్శలు చేయడంతో నేరుగా జనసేనాని సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. తన వారాహికి ఏ కలర్ వాడాలి అనేది కూడా వైసీపీ నాయకులే చెబుతున్నారని, వైజాగ్ లో హోటల్ నుంచి బయటకి రావోద్దన్నారు, తరువాత నడిచి వెళ్లొద్దు అన్నారు. ఇప్పుడు బస్సు యాత్ర చేయొద్దు అంటున్నారు.
రేపు నన్ను శ్వాస కూడా తీసుకోవద్దు అనేలా ఉన్నారు అంటూ ట్విట్టర్ లో విమర్శలు చేశారు. అలాగే తన దగ్గర ఉన్న ఆర్మీ కలర్ షర్ట్ ఫోటో షేర్ చేసి ఈ డ్రెస్సు కూడా నేను వేసుకోవద్దని వైసీపీ నాయకులు చెప్పేలా ఉన్నారు అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. అలాగే ఒకప్పటి ఓనిడా టీవీ యాడ్ లో కొమ్ములు వచ్చిన మనిషి ఫోటో షేర్ చేసి వైసీపీ పార్టీ వాళ్ళని చూస్తుంటే తనకి అది గుర్తుకొస్తుంది అంటూ ట్వీట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ట్వీట్ల పై మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా వింగ్ విమర్శలు స్టార్ట్ చేశారు. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, పెళ్ళాలు అంటూ విమర్శలు స్టార్ట్ చేశారు. అయితే వైసీపీ కావాలనే చంద్రబాబు టూర్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ వారాహి వెహికల్ పై అందరి దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.