night shift: ఉద్యోగస్తులకు షిఫ్ట్ లు ఉండటం, రొటేషన్ పద్ధతిలో నైట్ షిఫ్టులు కూడా రావడం సాధారణం. పగటి పూట షిఫ్ట్ చేయడం కన్నా రాత్రి పూట షిఫ్ట్ చేయడం అనేది అనేక సవాళ్లతో కూడుకొని ఉంటుంది. నైట్ షిప్ట్ చేసే వారికి అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. అందుకే తగిన జాగ్రత్తలు పాటించాలని సలహా కూడా ఇస్తుంటారు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, మీడియాలో పని చేసే వారు, విదేశాల్లో క్లయింట్లను కలిగిన ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులు మామూలుగా నైట్ షిఫ్ట్ లు చేస్తుంటాయి. నైట్ షిఫ్ట్ చేస్తే జీతం కూడా కాస్త ఎక్కువగా ఇస్తారనే టాక్ కూడా ఉంది. అయితే నైట్ షిఫ్ట్ లలో ఎక్కువకాలం పని చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నైట్ షిఫ్ట్ లలో పని చేస్తున్నప్పుడు, షిఫ్ట్ లు మారుతున్నప్పుడు శరీరం లోపల న్యూరోకెమికల్, హార్మోన్లలో మార్పులు జరుగుతాయని చెబుతున్నారు.
నైట్ షిఫ్ట్ చేసే వారు పగటి పూట నిద్రపోయి, రాత్రి పూట మేల్కోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది శరీరం ఈ కొత్త లైఫ్ స్టైల్ కి అనుమతించదు. దీంతో పగటి పూట నిద్ర పట్టక, రాత్రిపూట మేల్కొవడానికి ఇబ్బందులు పడుతూ.. చివరకు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
night shift:
నైట్ షిఫ్ట్ లు ఎక్కువగా చేసే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ 2012లో జరిపిన అధ్యయనం ప్రకారం వెల్లడించింది. నైట్ షిఫ్ట్ లలో పని చేసే వారికి సాధారణ వ్యక్తుల కన్నా ఏడు శాతం గుండె పోటు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ అధ్యయనం నిర్ధారించింది. నిద్ర అలవాట్లలో మార్పులు రక్తపోటు, రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.