Viral News: ఆకలి తీర్చుకోవడం కోసం కొందరు పడరాని పాట్లు పడుతుంటారు. ఇక మగతోడు లేని మహిళలైతే తమ పిల్లలను పెంచి పోషించేందుకు నానా తిప్పలు పడుతుంటారు. కానీ అడ్డదారులు మాత్రం తొక్కరు. కానీ కొందరుంటారు.. వాళ్ల రూటే సెపరేటు. ఎలాగైనా డబ్బు సంపాదనే లక్ష్యం. అది ఎలా వచ్చిందన్న దానితో సంబంధం ఉండదు. డబ్బున్న వారికి వల వేయడం.. మాయమాటలు చెప్పి కావల్సినంత డబ్బు గుంజడం.. సైలెంట్‌గా సైడ్ అయిపోవడం వీరి పని. ఇలాంటి మహిళే తాజాగా వార్తలకెక్కింది.
ఆ కిలాడీ లేడీ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకుంది. ఆమె ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తోలే అనుకునేరు. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తే. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పేకేరు గ్రామానికి మహిళ. ఆమె పేరు రోకళ్ల వెంకట లక్ష్మి.. అలియాస్ గుంటూరు కందుకూరు నాగలక్ష్మి. ఈమె వృత్తి ఏంటో తెలియదు కానీ ప్రవృత్తి మాత్రం.. డబ్బున్న వారికి వల వేయడం. పెళ్లి చేసుకోవడం.. అందినకాడికి దోచుకోవడం.. ఆనక అక్కడి నుంచి ఉడాయించడం.
వెంకట లక్ష్మి బాధితుల్లో భీమవరంలో ఇద్దరున్నారు. ఇక గుంటూరులో ఏకంగా నలుగురు బాధితులు ఉన్నారు. విజయవాడలో ఒకరున్నారు. ఈమె బాధితుల్లో ఒకరైన కొత్తకోట నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అతనిని పరిచయం చేసుకుని మెల్లిగా అతనికి దగ్గరైంది. అనంతరం 2021 మార్చి 13న గుంటూరులో వివాహం చేసుకుని కాపురాన్ని విశాఖలోని జగదాంబ జంక్షన్‌కు షిఫ్ట్ చేసింది. ఆడిటర్‌గా పని చేస్తున్న అతని జీతం మొత్తం ప్రతి నెలా స్వాహా చేసేసింది. అంతేనా.. గుంటూరు జిల్లాలో ఒక ఇల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12 సెంట్ల ఖాళీ స్థలం తన పేరిట రాయించుకుంది. అంతా ఊడ్చేసిన తర్వాత 3 తులాల బంగారం, బ్యాంకు అకౌంట్‌లో ఉన్న డబ్బంతా తీసుకుని అతడిని వదిలేసి వెళ్లిపోయింది. తరువాత నాగేశ్వరరావు ఆరా తీస్తే గానీ అమ్మగారి బండారం బయట పడలేదు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.