TRS vs BJP : తెలంగాణలో రాజకీయం మాంచి రసపట్టుమీదుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ.. సమరోత్సాహం మాత్రం ఇప్పటికే ప్రారంభమైంది. ఇక రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే తలంపుతో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పార్టీలోకి అటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని లాగేసింది. అలాగే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని, బీజేపీలో చేరుతానని ప్రకటించడం మరింత వేడిని పెంచింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం బీజేపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకా కొందరు కీలక నేతలు తమ పార్టీలోకి రానున్నట్టు ఇప్పటికే బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రెస్‌మీట్లలో చెబుతూ వస్తున్నారు.
బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇప్పటికే తెరదీశారు. కాస్త అటు ఇటుగా ఉన్న నేతలు, అసంతృప్తితో ఉన్న నేతలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు హస్తినకు వెళ్లి ఢిల్లీ పెద్దలను కలిసి ఆపరేషన్ ఆకర్ష్ గురించి చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. తెలంగాణలో అధికారం సాధిస్తామని ప్రకటించింది. తమ పార్టీలో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్న నేతల జాబితాను బీజేపీ సిద్ధం చేసింది. జాతీయ నాయకత్వం ఆమోదం కోసం ఎదురుచూస్తోందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
TRS vs BJP : అటు టీఆర్ఎస్‌కు, ఇటు.. కాంగ్రెస్‌కూ గడ్డురోజులే..
కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ తెలంగాణలో ఇబ్బందులు పడుతూనే ఉంది. నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కీలక నేతలెవరూ సరిగా సహకరించడం లేదని బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో కేడర్‌లో కూడా పార్టీ పట్ల ఆసక్తి తగ్గిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కనీసం పార్టీ కార్యకర్తలకు సరైన దిశానిర్దేశం చేసే నేతలు సైతం లేకపోవడం గమనార్హం. తెలంగాణలో అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది తప్ప కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే రానున్న రోజుల్లో అటు టీఆర్ఎస్‌కు, ఇటు.. కాంగ్రెస్‌కూ పరిస్థితులు కలిసొచ్చే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు.