Viral News : పెళ్లయ్యాక దంపతుల మధ్య గొడవలు రావడం సర్వ సాధారణం. మాటా మాటా అనుకోవడం.. ఇగోలకు పోవడం.. వెరసి బ్యాగ్ తీసుకుని అమ్మాయిలైతే పుట్టింటికి.. అబ్బాయిలైతే కాసేపు ఇంటి నుంచి దూరంగా ఒకపూట స్నేహితులతో బయటకు. ఇక కొందరు భార్యలు తమ భర్త కొడుతున్నాడని పుట్టింటికి వెళ్లిపోతుంటారు. కానీ ఈ వార్త కాస్త డిఫరెంట్. కుక్క.. తోకను ఊపడం కామన్.. కానీ తోకే కుక్కను ఆడించిందనుకోండి అదీ వార్త. ఓ భార్య రోజూ తన భర్తను చితక్కొడుతోందట. భరించలేని ఆ భర్త చెట్టెక్కి కూర్చొన్నాడు. ఒక రోజు రెండు రోజులు కాదండోయ్ ఏకంగా నెల రోజులుగా తాటి చెట్టుపై కూర్చొన్నాడు.
అసలు ఏం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రామ్ ప్రవేశ్ కు, అతని భార్యకు కొన్నిరోజులుగా తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో రామ్ ప్రవేశ్ భార్య.. మహా గయ్యాళి. రోజూ గొడవతో సరిపెడితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కానీ.. పరిగెత్తించి మరీ కొట్టేది. ఆమె టార్చర్ భరించలేక అతను ఆమె దాడి నుంచి తప్పించుకునేందుకు తాటి చెట్టు ఎక్కి కూర్చొన్నాడు. నెల రోజులుగా రామ్ ప్రవేశ్.. తాటిచెట్టునే తన ఆవాసంగా మార్చుకుని.. అక్కడే ఉంటున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు అతనికి తాడుతో ఆహారం అందిస్తూ వస్తున్నాడు.
Viral News : చెట్టు దిగితే పెళ్లాంతో బాధ.. దిగకుంటే గ్రామస్తులతో బాధ
అయితే… రామ్ ప్రవేశ్ చెట్టు మీద ఉండటానికి బరాసత్‌పూర్ గ్రామస్తులు అంగీకరించడం లేదు. ఎందుకంటే అది చాలా వెనుబడిన ప్రదేశం. అక్కడి నివాసులు ఇప్పటికీ బహిర్భూమికి బయటకు వెళుతుంటారు. ఈ క్రమంలో రామ్ ప్రవేశ్ తాటి చెట్టుపై ఎక్కి కూర్చొంటే వారందరికీ బహిర్బూమికి వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో గ్రామస్థులంతా అతడిని చెట్టుదిగి ఇంటికి వెళ్లిపోవాలని గొడవ పెడుతున్నారు. చెట్టు దిగితే పెళ్లాంతో బాధ.. దిగకుంటే గ్రామస్తులతో బాధ. ఈ కష్టం పగోళ్లకు కూడా రాకూడదనిపిస్తోంది కదా. మొత్తానికి ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో సంచలనంగా మారింది.