టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైనటువంటి విక్టరీ వెంకటేష్ అప్పట్లో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు సంపాదించాడు . ఆయన ఏ మూవీ తీసినా అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు. నువ్వునాకు నచ్చావ్ వంటి క్లాసిక్ హిట్ సినిమా తరువాత వెంకటేష్ మళ్లీ ఏ సినిమాతో వస్తాడా అని ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో వాసు అనే సినిమా తీశాడు. ఈ సినిమా పరాజయం పాలైంది. ఇక ఆ తరువాత అదే కోవలో జెమిని సినిమా తీశాడు అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.
ఒక మాస్ హీరోగా ఎదగాలనుకున్న వెంకటేష్ ప్రయత్నం ఈ మూవీ ద్వారా బెడిసి కొట్టిందనే చెప్పాలి. అతని కెపాసిటీ ఫ్యామిలీ సినిమాలు తీయడమే అని మరోసారి నిరూపితం చేసింది వసంతం సినిమా . వాసు, జెమినీ వంటి పరాజయాల తరువాత వెంకటేష్ కి దక్కిన హిట్ సినిమా ఇది. ఈ సినిమా 2003లో విడుదలైంది. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న విక్రమన్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. అతను తెలుగులో నేరుగా తీసిన తొలి సినిమా వసంతం కావడం విశేషం. ఈ మూవీ తరువాత చెప్పవే చిరుగాలి సినిమా తీసి మరొక విజయాన్ని కూడా అందుకున్నారు. కానీ విక్రమన్ ఎందుకో తెలుగు సినిమాలే తీయలేదు. కొన్నాళ్లకు అతని కెరీర్ ముగిసిపోయింది.

ఇక వసంతం మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమా క్లాసిక్ విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం.. ఈ చిత్రానికి సంగీతం అందించినటువంటి ఎస్.ఏ.రాజ్ కుమార్ అని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లింది తొలుత పాటలే. ఆ తరువాత సినిమా కథ, మిగతా విషయాలు. వసంతం మూవీకి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..? సింహాద్రి మూవీకి పోటీగా విడుదలై ఘన విజయాన్ని సాధించడం రెండు సినిమాలకు ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి ఉంటుంది. సింహాద్రి ప్రభంజనం అప్పట్లో గట్టిగానే ఉండేది. అయినప్పటికీ వసంతం మూవీ డీసెంట్ హిట్ గా నిలవడమే కాకుండా వెంకటేష్ ని మళ్లీ ఫామ్ లో ఉంచింది. ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్, కళ్యాణీ హీరోయిన్లుగా ఇద్దరూ నటించారు.