Krishnam Raju : గిరిజాల జుట్టు.. చింతనిప్పుల్లాంటి కళ్లు.. ఆరడుగుల ఎత్తుతో.. వెండితెరపై 50 ఏళ్లకు పైగా అలరించి రౌద్రరసానికి నిలువెత్తు చిరునామాగా నిలిచి.. రెబెల్‌స్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన కృష్ణంరాజు (83) ఇక లేరు. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు ప్రేక్షకులను హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించారు. 180కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయతే అప్పటికే ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స పొందుతున్నారు. అసలు ఆయన ఎందుకు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు? వైద్యుల సంరక్షణలో ఉండి ఎలా మరణించారు? అనే విషయాలు చాలా మందికి సందేహంగా మిగిలాయి.
కొంతకాలంగా కృష్ణంరాజు మధుమేహం, మూత్రపిండ వ్యాధి, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. కృష్ణంరాజు కూడా కొవిడ్ బాధితులే. ఆయన కొవిడ్ నుంచి బయట పడినప్పటికీ పోస్ట్ కొవిడ్ సమస్యలు మాత్రం వెంటాడాయి. నిమోనియా వంటి పోస్ట్ కొవిడ్ సమస్యలు బాధించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో ఈ నెల ఐదో తేదీన కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. ఆయన రక్త ప్రసరణలో లోపం ఉందని, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా (ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ యాంటి బయాటిక్ ఔషధానికీ లొంగని బ్యాక్టీరియా) ఆయన ఊపిరితిత్తుల్లో చేరడంతో తీవ్ర నిమోనియా వచ్చినట్టు గుర్తించారు.
Krishnam Raju : మూత్రపిండాలు పూర్తిగా విఫలమైనట్లు పరీక్షల్లో వెల్లడి
అప్పటికే ఇప్పటికే దెబ్బతిన్న ఆయన మూత్రపిండాలు పూర్తిగా విఫలమైనట్లు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో వెంటనే ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేయడం ప్రారంభించారు. పల్మనాలజీ, క్రిటికల్‌కేర్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఇన్ఫెక్షన్ డిసీజెస్, వాస్క్యులర్ సర్జరీ నిపుణులతో కూడిన బృందం ఆయనకు చికిత్స అందించింది. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం చికిత్సకు సహకరించకుండా పోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం సమీక్ష జరుపుతున్నప్పటికీ ఉపయోగం లేకపోయిందని.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారని ఏఐజీ వైద్యులు తెలిపారు.