West Godavari : తెలుగు రాష్ట్రాల్లో ప్రేమోన్మాదుల ఘాతుకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకపు అమ్మాయిలను టార్గెట్ చేసి వారి ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారు అబ్బాయిలు. తాజాగా ప్రేమ నిరాకరించిందని ప్రేమికురాలితో సహా ఆమె తల్లి, చెల్లిపై దాడి చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా కొండ్రుపోలు గ్రామం ఉలిక్కిపడింది.

తాడేపల్లిగూడెం మండలం, కొండ్రుపోలులో గ్రామంలో నివాసముంటున్నాడు 25 ఏళ్ల కల్యాణ్. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అదే గ్రామంలో నివాసముంటోంది 21 ఏళ్ల మాణిక్యం. ఈ యువతి ఈ మధ్యనే డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కల్యాణ్ మాణిక్యాన్ని ప్రేమిస్తున్నానంటూ గత కొంత కాలంగా వెంబడిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాణిక్యం తండ్రి పలుమార్లు కల్యాణ్‌ను తన కూతురికి దూరంగా ఉండాలంటూ హెచ్చరించాడు. అయినా కల్యాణ్ ధోరణిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. మాణిక్యం తండ్రి వెంకటేష్ మీద కోపంతో వారికి చెందిన కండివాముకు నిప్పుపెట్టాడు. అక్కడితో ఆగకుండా పీకల వరకు తాగి యువతి ఇంటికి కరెంట్‌ను నిలిపివేయడంతో పాటు సీసీకెమెరాలను ధ్వంసం చేశాడు. అదే సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన మాణిక్యంతో పాటు యువతి తల్లి భాగ్యలక్ష్మీ, చెల్లి వెంకటలక్ష్మీపైన ప్లాన్‌తో కత్తితో దాడికి దిగాడు.

ఈ దాడిలో మొదటగా తన ప్రేమను నిరాకరించిన మాణిక్యం బుగ్గను కత్తితో చీరాడు, ఆ తరువాత పీకపైన కోసాడు, తన కూతురిని రక్షించుకునేందుకు అడ్డుగా వచ్చిన తల్లి ఛాతిపైన కత్తితో దాడికి తెగబడ్డాడు కిరాతకుడు. చెల్లి వెంకటలక్ష్మీ పీకపై కోసాడు. అరుపులు కేకలు వినిపించడంతో గ్రామంలోని వారంతా సంఘటనా స్థలానికి చేరుకునే లోపే కిరాతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితులను గ్రామస్థలు చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

మాణిక్యం మూతి నుంచి చెవు వరకు చెంప కోసుకుపోవడంతో బాధిత యువతి మాట్లాడే పరిస్థితిలో లేదు. ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి తెగించిన కల్యాణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.
Advertisement