Virat Kohli: భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ తాజాగా తిరిగి ఫాం అందుకొని భారత్ కు తిరుగులేని విజయాలు అందిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాక్ తో జరిగిన తొలి మ్యాచ్ లో విరాట్ వీర విహారం చేసి 53 బంతుల్లోనే 82 పరుగులతో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఛేజ్ మాస్టర్ గా మళ్లీ ఫాం ను అందుకున్న కోహ్లీని ఫ్యాన్స్ ఆకాశానికెత్తుతున్నారు. పాక్ తో మ్యాచ్ లో విజయం చిరస్మరణీయ ఇన్నింగ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది.
సుమారు మూడు, నాలుగేళ్ల పాటు పేల ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు కోహ్లీ. ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయాడు. కోహ్లీపై విపరీతమైన ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లకూ టీమిండియా కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చింది. టెస్టులు, టీ20ల్లో కెప్టెన్సీ నుంచి స్వయంగా తప్పుకున్నాడు కోహ్లీ. అయితే వివాదాస్పద రీతిలో వన్డేల కెప్టెన్సీ నుంచి తప్పించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది.
బ్యాట్ తోనే సమాధానమిచ్చిన కోహ్లీ..
తనపై వచ్చిన ట్రోల్స్ కు, విమర్శలకు ఆటతీరుతో, బ్యాట్ తోనే విరాట్ కోహ్లీ సమాధానమిచ్చాడు. ఆసియా కప్ లో అఫ్గానిస్తాన్ పై సెంచరీతో కింగ్ ఈజ్ బ్యాక్ అని గర్వంగా చెప్పుకొనేలా కోహ్లీ ఆటతీరు మెరుగుపర్చుకున్నాడు. తనది నిస్వార్థమైన ఆట అని మరోసారి నిరూపించుకున్నాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ నిస్వార్థాన్ని మరోసారి నిరూపించుకున్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు.
Virat Kohli:
పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా నవాజ్ వేసిన చివరి ఓవర్లో ఆఖరి మూడు బంతులకు భారత్ 5 పరుగులు చేయాల్సి ఉంది. ఫ్రీ హిట్ బాల్ కు కోహ్లీ బౌల్డ్ అవుతాడు. ఈ నేపథ్యంలో బంతి బౌండరీ వైపు వెళ్తుంది. ఇదే సమయంలో కోహ్లీ రెండు పరుగులు మాత్రమే చేసే చాన్స్ ఉంది. అయితే, మూడో పరుగుకు కూడా వెళ్తాడు. దినేష్ కార్తీక్ కూడా అప్పుడే క్రీజులోకి వచ్చాడు. దీంతో కార్తీక్ కంటే కోహ్లీనే ఫినిష్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ స్వార్థం చూసుకోకుండా మూడో పరుగు తీసి కార్తీక్ కు చాన్స్ ఇచ్చాడు. దీంతో పాటు ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అర్ధ సెంచరీకి చేరువలో ఉన్నప్పటికీ దినేష్ కార్తీక్ నే స్ట్రైక్ తీసుకోవాలని సూచిస్తాడు. ఇలా నిస్వార్థానికి మారుపేరుగా కోహ్లీ నిలుస్తున్నాడు.