Vijayasai Reddy : వైసీపీపై టీడీపీ దాని అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని రాజ్యసభ ఎంపీ, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. నేడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు సవాల్ విసిరారు. ‘‘రాముకి ఒక పత్రిక, ఒక ఛానల్ ఉందనే కదా ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నారు? నేనింత వరకూ వ్యాపారం చేయలేదు. ఈ రోజు మీ పత్రికా మిత్రులందరి ముందు చెబుతున్నా. మీడియా రంగంలో ఏ రంగంలో అయితే రాము ఉన్నాడో.. అదే రంగంలో నేనే ఎంటర్ కాబోతున్నా’’ అని వెల్లడించారు.
ఈ సందర్భంగానే రామోజీ రావుకు మరో సవాల్ విసిరారు. ‘‘చూసుకుందాం రాము.. నీ ఛానల్స్ ఏ రకంగా పని చేస్తాయి? నేను పెట్టబోయే ఛానల్ ఏ రకంగా పని చేస్తుందనే విషయం చూసుకుందాం. నీ రంగంలో నేను ఎంటర్ కాబోతున్నా.. ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటున్నా. నువ్వు అడిగినట్టుగానే.. నీ తొత్తులు అడిగినట్టుగానే.. సీబీఐ ఎంక్వైరీకి నేను రెడీగా ఉన్నా. నువ్వు రెడీగా ఉన్నావా? ’’ అని ప్రశ్నించారు. ఇంకా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఒక్క ఫిలింసిటీలోనే 2,500 ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
రామోజీ ఒక పచ్చళ్లు అమ్ముకునే వ్యక్తి అని.. అలాంటి వ్యక్తి లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. మార్గదర్శి డిపాజిటర్లను సైతం మోసం చేశారని దుయ్యబట్టారు. ఆస్తులపై విచారణకు సిద్ధమా? అటు రామోజీకి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుకి సైతం విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. ఈనాడుకు ఇతర పత్రికలను జత చేస్తూ..ఈనాడు దాని అనుబంధ కుల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు విషపు రాతలతో కొత్తదారులు అన్వేషిస్తూ.. దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తున్నాయని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.