Hero Vijay : వారసుడు చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ చిత్రం విడుదల టాలీవుడ్‌లో కాక రేపుతున్న విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా హీరో విజయ్ తన అభిమానులను కలుసుకుంటుండటం ఆసక్తికరంగా మారింది. నిజానికి రజినీకాంత్‌కు ఉన్నంత ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్ అంటే అతిశయోక్తి కాదు. అభిమాన సంఘాల ద్వారా తమిళ ప్రజానీకానికి ఎన్నో సేవలను విజయ్ అందించాడు. ప్రకృతి విపత్తులొచ్చినా.. లేదంటే జనం ఏదైనా సమస్యల్లో ఉన్నా వెంటనే స్పందిస్తాడు.
అయితే విజయ్ రాజకీయరంగ ప్రవేశం చేస్తాడనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. జయలలిత మరణానంతరం విజయ్ బరిలోకి దిగుతాడనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఎందుకో విజయ్ వెనక్కి తగ్గాడు. ఇప్పటి వరకూ విజయ్ అయితే నేరుగా రాజకీయాల్లోకి ఎంటర్ కాలేదు.. కానీ అభిమానులు కొందరు తమిళనాడులోని పలు నియోజకవర్గాల్లో ఆ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో తెలియదు కానీ తన అభిమానులను మాత్రం తప్పనిసరిగా ఏడాదికోసారి కలుస్తూ ఉంటాడు.
అయితే ఇటీవలి కాలంలో అంటే కరోనా లాక్‌డౌన్ నుంచి ఈ నాలుగేళ్లలో విజయ్ తన అభిమానులతో భేటీ అయ్యింది లేదు. కానీ తాజాగా నిన్న మధ్యాహ్నం స్థానిక పనైయూర్‌లోని తన కార్యాలయంలో అభిమాన సంఘ నిర్వహకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. వారసుడు చిత్రం టాలీవుడ్‌లో కాకరేపుతోంది. డబ్బింగ్ చిత్రాలకు సంక్రాంతి సమయంలో ప్రాధాన్యమివ్వొద్దని ఇండస్ట్రీ పెద్దలు కోరడమే దీనికి కారణం. థియేటర్ల సమస్యను అధిగమించేందుకు టాలీవుడ్ పెద్దలు ఇలా కోరితే.. మరోవైపు తమిళ దర్శకులు దీనిపై మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులతో విజయ్ భేటీ ఆసక్తికరంగా మారింది.