Vijay Devarakonda : కరణ్ జోహార్, ఛార్మీ, పూరీ నిర్మాతలుగా వ్యవహారిస్తున్న లైగర్ మూవీ ఆగస్టు 25న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ తరుణంలో మూవీ ప్రమోషన్స్‌ని చిత్రబృందం జోరుగా సాగిస్తోంది. అయితే సినిమా ప్రమోషన్స్ సమయంలో వివాదాల్లో పడటం విజయ్ దేవరకొండకు కొత్తేమీ కాదు. ఈ సినిమాకు యాజ్ టీజ్‌గా వివాదాల్లోకి కావాలనో.. అనుకోకుండానో ఇరుక్కుపోయాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇటీవలే విడుదలై అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిన ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’పై విజయ్ స్పందించాడు. బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా ట్రెండింగ్ విమర్శిస్తూ కామెంట్స్ చేసి నెత్తిమీదకు తెచ్చుకున్నాడు.
దీంతో లైగర్ సినిమాని కూడా బాయ్‌కాట్ చేయాలంటూ ‘Boycott Liger’ని నెటిజన్స్ ట్రెండ్ చేశారు. మొత్తానికి ఈ వివాదం రచ్చ రచ్చగా మారింది. దీనిపై విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు, మన ధర్మం మనం చేసినప్పుడు, ఎవడిమాటా వినేదే లేదు.. కొట్లాడదాం..’ అంటూ ఫైర్ ఎమోజీని, అలాగే లైగర్ ట్యాగ్‌ని పోస్ట్ చేశాడు. అంతటితో వివాదం చల్లారక పోవడంతో ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. కరణ్ జోహార్ కలవడం వల్లే తమ సినిమాకు అంత రీచ్ వచ్చిందని ఆన్‌లైన్ ట్రోలర్స్ సమస్యేంటో.. వాళ్లకు ఏం కావాలో తెలియడం లేదన్నారు.
Vijay Devarakonda : మేం మూవీస్ చేయకూడదా?
‘మేం సినిమా ప్రారంభించినప్పుడు బాయ్‌కాట్ బాలీవుడ్ అనేది లేదు. ఆ సమయంలో మా సినిమాని పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లడానికి కరణ్ జోహార్ సర్ కనిపించారు. బాహుబలిలాగే మా మూవీ ఉపయోగపడతారని అనుకున్నాం. ఆయన మాతో కలవడం వల్లే నార్త్ మన సినిమాకు ఇంత రీచ్ వచ్చింది. అయితే.. ఆన్‌లైన్ ట్రోలర్స్ సమస్య ఏమిటో.. వాళ్లకు ఏం కావాలో నాకు ఖచ్చితంగా తెలియట్లేదు. వారికి మేం సినిమాలు చేయడం ఇష్టం లేదేమో. మేము మాత్రం కరెక్ట్‌గా ఉన్నాం. నేను హైదరాబాద్‌లో పుట్టాను. చార్మీ పంజాబ్‌లో పుట్టింది. పూరీ సార్ నర్సీపట్నంలో పుట్టారు. మేం మూవీస్ చేయకూడదా? మూడేళ్లు కష్టపడి ఈ సినిమా చేశాం. మా సినిమాలను మేం విడుదల చేయకూడదా? మేం ఇంట్లోనే కూర్చోవాలా? ప్రేక్షకులు మాపై చూపిస్తున్న ప్రేమను మీరందరూ చూస్తున్నారు. అలాంటి ప్రేక్షకుల కోసమే సినిమాలు చేస్తున్నాను. ఆ ప్రేక్షకులు నాకు కావాలి. మా కోసం ఇంతమంది ఉండగా మాకు ఏ భయం లేదు’ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.