రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో తాజాగా డిజాస్టర్ కొట్టాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ హైప్ తో రిలీజ్ అయ్యి ఊహించని స్థాయిలో ఫ్లాప్ అయ్యింది. దీంతో విజయ్ దేవరకొండ మీద కొంత మంది వ్యతిరేక ప్రచారం కూడా మొదలు పెట్టారు. అలాగే యాంకర్ అనసూయ అయితే నేరుగా విమర్శలు చేసింది. అయితే విజయ్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు.
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి ఖుషి అనే మూవీలో విజయ్ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే లైగర్ సినిమా తర్వాత ఇక ప్రేమ కథలు చేయనని, ఖుషి మూవీ నేను చేయబోయే చివరి లవ్ స్టోరీ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. దీనికి కారణం దిల్ రాజు, వైజయంతి, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పాన్ ఇండియా లెవల్ లోనే ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాడు. అయితే లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో రౌడీ స్టార్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గతంలో విజయ్ ఒకే చెప్పాడు. ఇప్పుడు ఆ సినిమాని పట్టాలు ఎక్కించే పనిలో పడ్డాడు. ప్రస్తుతం మోహన కృష్ణ తెరకెక్కించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. దీని తర్వాత విజయ్ దేవరకొండతో సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు బోగట్టా. ఇక దీనితో పాటు దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమా చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అలాగే రాజ్, డీకే ద్వయం దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ లో సినిమాకి కూడా విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.