Liger : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్. అనన్యపాండే హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది. కానీ ఈ సినిమా తొలి షోతోనే డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు నిర్మాతలు భారీ బడ్జెట్‌ను కేటాయించారు.
దీంతో అంచనాలు పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేశాయి. కానీ లైగర్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అనుకున్నంత స్థాయిలో అందుకోలేకపోయింది. లైగర్ రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినప్పటికీ విడుదల తర్వాత సీన్ మారిపోయింది.
తొలి షో నుంచే సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ బద్దలవుతుందనుకున్న సినిమా కాస్త బొక్కబోర్లా పడింది. విడుదలకు ముందు ఈ మూవీ రూ.200 కోట్లకుపైగా వసూలు చేస్తుందని చిత్ర యూనిట్ ఆశపడింది. కానీ అన్నీ అడియాశలయ్యాయి. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. అన్ని భాషల్లోనూ ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో లైగర్ మూవీ నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్, నటి చార్మీ కౌర్‌లు నిర్మాతలు కాగా.. పూరీ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించాడు.
Liger : తన వాటాలో 70 శాతం వెనక్కి ఇచ్చాడట..
లైగర్ పరాజయంతో పూరీ తన పారితోషికంతో పాటు లాభాల్లో వచ్చిన తన వాటాలో 70 శాతం వెనక్కి ఇచ్చాడని సమాచారం. ఇక హీరోగా చేసిన విజయ్ కూడా తన పారితోషికంలో కొంతభాగాన్ని వదులుకున్నాడని తెలుస్తోంది. విజయ్ ఈ సినిమాకి 20-25 కోట్ల పారితోషికం తీసుకున్నాడని టాక్. దీనితో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్‌లో విజయ్‌కి కూడా వాటా ఉందని సమాచారం. ఇప్పుడు ఆ వాటాను వద్దని పూరీ, చార్మీలకు చెప్పడమే కాకుండా.. తన పారితోషికంలో రూ.6 కోట్లను విజయ్ వెనక్కి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాతలను ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడంటూ విజయ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.