Crime News: కాపురంలో వచ్చే చిన్న చిన్న సమస్యల కారణంగా క్షణికావేశంతో కొందరు, అనుమానంతో మరి కొందరు సొంత కుటుంబ సభ్యులను సైతం చంపేందుకు వెనుకాడటం లేదు. జీవితాంతం కలిసి బతకాల్సిన భార్యను అనుమానంతో భర్త దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నగర ఇన్ ఛార్జ్ సీఐ విజయ్ బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజాబాబాద్ కు చెందిన అనీస్ ఫాతిమాకు 2013 సంవత్సరంలో సయ్యద్ సుల్తాన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి సంసారంలో అనుమానం అనే బీజం పడింది. చెప్పుడు మాటలు విన్న భర్త సుల్తాన్ కు భార్య ఫాతిమా ప్రవర్తనపై అనుమానం కలిగింది. దీంతో తరచూ భార్య ఫాతిమాను భర్త సుల్తాన్ వేధించడం మొదలు పెట్టాడు. భర్త వేధింపులకు అత్త వత్తాసు పలకడంతో నిత్యం గొడవలు సాగుతూనే ఉన్నాయి. దీంతో ఫాతిమ విసుగు చెంది నిజామాబాద్ లోని త్రీ టౌన్ పరిధిలో గల బ్యాంక్ కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది.

దీంతో మరింత అనుమానం పెంచుకున్న భర్త ఆవేశానికి గురయ్యాడు. శనివారం భర్త సుల్తాన్ తన భార్య ఫాతిమా తండ్రి సయ్యద్ ఖలీంకు ఫోన్ చేసి తన పిల్లలను చూడటానికి ఫాతిమా దగ్గరికి వెళ్తున్నా అని చెప్పాడు. అంతలోనే మామకు వచ్చిన అల్లుడి ఫోన్ కాల్ షాకింగ్ కలిగించింది. కాసేపటికి మళ్లీ ఫోన్ చేసి నీ బిడ్డను చంపేశానని, నా పిల్లలను నేను తీసుకెళ్తున్నానని మాకు సుల్తా న్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో ఖంగారుగా సయ్యద్ ఖలీం కూతరు ఇంటికి చేరుకున్నారు.
అక్కడ కూతురు ఫాతిమ మెడకు చున్నీ బిగించుకుని వేలాడుతూ విగతజీవిగా పడిఉంది. వెంటనే తండ్రి ఖతీం త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఆధారాలను సేకరించిన పోలీసులు ఫాతిమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మితం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కూతురిని అనుమానంతో వేధింపులకు గురి చేసి మెడకు ఉరివేసి అల్లుడు సుల్తాన్ హత్య చేశాడని ఫాతిమా తండ్రి ఖలీం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఖలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్ బాబు తెలిపారు.