Nirmala Sitharaman – KTR: కామారెడ్డి జిల్లాలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన తెలంగాణలో దుమారం రేపుతోంది. జిల్లాలోని బీర్కూర్ రేషన్ షాపుకు వెళ్లి నిర్మలా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రేషన్ లబ్ధిదారులతో మాట్లాడిన ఆమె.. రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేస్తున్నారా? లేదా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటల్ పై నిర్మలా మండిపడ్డారు. రేషన్ షాపులో ప్రధాని మోదీ ఫ్లెక్సీ ఎందుకు లేదని నిలదీశారు. దేశ ప్రధాని అయిన మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని కలెక్టర్ పై నిర్మలా సీతారామన్ ప్రశ్నల వర్షం కురిపించారు. పేద ప్రజల కోసం రేషన్ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో మోదీ ఫ్లెక్సీ లేకపోవడం ఏంటని గట్టిగా నిర్మలా నిలదీశారు.
రేషన్ షాపుల్లో మోదీ ఫ్లెక్సీ ఉండాల్సిందేనని, అది చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ప్రతి రేషన్ షాపులో మోదీ ఫొటో ఉండేలా కలెక్టర్లు చూసుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లెక్సీ పెట్టడానికి వచ్చిన అధికారులపై టీఆర్ఎస్ కార్యకర్తలు గంతులేస్తున్నారని, ఫ్లెక్సీలను చింపేస్తున్నారని నిర్మలా ఆరోపించారు. ఇది సరైన పద్దతి కాదని టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు తన మద్దతు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో నిర్మలా సీతారామణ ప్రవర్తన తనను భయపెట్టిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తారని తెలిపారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ కేంద్రమంత్రి పట్ల గౌరవంగా ప్రవర్తించారని, ఆయనకు తన అభినందనలు అని కేటీఆర్ తెలిపారు.
Nirmala Sitharaman – KTR:
అయితే ఈ ఇష్యూపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల దాడి మొదలైంది. ఎప్పటినుంచో కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం మోదీ ఫొటో పెట్టకుండా కేసీఆర్ ఫొటో పెట్టి ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శలు బీజేపీ నేతలు చేస్తు్న్నారు. రేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, మోదీ ఫొటో పెట్టకపోవడం ఏంటని బీజేపీ నేతలు ఎప్పటినుంచో ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలపై కేంద్రం నిధులు ఇస్తున్నా.. కేసీఆర్ మోదీని గుర్తించడం లేదని రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.