AMARAVATI: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రగడ కొనసాగుతోంది. ఓ వైపు అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు రెండో విడత పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మరోవైపు మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ వస్తోంది. వాస్తవానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మీకందరికీ తెలిసిందే..!
టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీలో సైతం తీర్మానం చేసింది. ఇందుకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అమరావతి రాజధాని నిర్ణయానికి సుముఖుత వ్యక్తం చేశారు. ప్రాంతాల మధ్య గొడవలు రావడం ఇష్టం లేక అమరావతికి అమోదం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కానీ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో వైసీపీ అభివృద్ధి వికేంద్రీకరణ పాట మొదలుపెట్టింది. గతంలో చెప్పిన మాటలకు విరుద్దంగా నిర్ణయం తీసుకుంది. పైగా ఎన్నిలక ముందు కూడా వైసీపీ అమరావతిని రాజధానిగా ఉండనివ్వం.. మారుస్తామని కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా గెలిచిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకుని రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు.

దీంతో అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తాడేపల్లిగూడెంకు చేరింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఫ్లెక్సీల వార్ స్టార్ట్ అయింది. కొందరు అమరావతి రైతులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరికొందరు మాత్రం అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది.
రైతులకు వ్యతిరేక ఫ్లెక్సీల్లో ‘గో బ్యాక్ ఫేక్ యాత్రికులు’ అని రాయించారు. రైతుల ముసుగులోని ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ‘అమరావతి రియలెస్టేట్ వద్దు. ఆంధ్రా స్టేట్ ముద్దు’ అని కొటేషన్స్ వేయించారు. రాష్ట్రం కోసం జగన్ ఆరాటం… 26 గ్రామాల కోసం చంద్రబాబు నకిలీ పోరాటం అని రాశారు. జగన్ ది అభివృద్ధి మంత్రం.. చంద్రబాబుది రాజకీయ కుతంత్రం అని పేర్కొన్నారు.