Biggboss 6 : అమ్మమ్మమ్మా.. శనివారం ప్రోమో రాసుకున్నోడికి రాసుకున్నంత.. ఇప్పటి వరకూ లేజీగా తిని కూర్చొన్న హౌస్ మేట్స్‌ను సెట్ చేయడమే కాదు.. పడుకుని నిద్ర పోతున్న టీఆర్పీని సైతం అమాంతం లేపేసి ఎక్కడో కూర్చోబెట్టే ప్రోమో.. లేటుగా అయినా ఘాటుగా వదిలింది స్టార్ మా. ఘాటు అంటే మామూలు ఘాటు కాదండోయ్.. ముక్కు పుటాలు అదిరేంత. ఇప్పటి వరకూ ఏ సీజన్‌లోనూ ఎవరికి ఇలా మూకుమ్మడిగా పీకనంత గట్టి క్లాస్ పీకేశారు. మొత్తంగా తొమ్మిది మందిని ఎంచుకుని కుండ బద్దలు కొట్టి మరీ తాట తీసేశారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 రెండో వారం కూడా దాదాపు పూర్తైపోయినట్టే. హోస్ట్ నాగార్జున వచ్చేశారు. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా క్లాస్ తీసుకున్నారు. పేరంటానికి కూర్చొన్నట్టు కూర్చొని కబుర్లు చెప్పుకునే వారందరికీ ఇవ్వాల్సిన దానికంటే కాస్త ఎక్కువగానే ఇచ్చేశారు. వస్తూ వస్తూ గుంటూరు కారం తిని వచ్చారో ఏమో కానీ మంటలు మండించారు. బాలాదిత్య, షానీ, సుదీప, శ్రీ సత్య, వాసంతి, మరీనా-రోహిత్, అభినయ, కీర్తి, శ్రీహాన్..ఈ తొమ్మిది మంది చిల్ అవడానికి వచ్చారంటూ పేరు పేరునా క్లాస్ పీకారు.
Biggboss 6: ఈ వారం సింగిల్ కాదు.. డబుల్ ఎలిమినేషన్
ఈ తొమ్మిది మందికి క్లాస్ పీకిన అనంతరం నాగ్ షాకింగ్ విషయాన్ని చెప్పారు. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కాదు.. డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు. అస్సలు గేమ్ ఆడటం లేదంటూ క్లాస్ పీకిన తొమ్మిది మందిలో ముగ్గురు నామినేషన్స్‌లో ఉన్నారని.. వారితో పాటు మిగిలిన ఆరుగురి బ్యాగ్స్ కూడా తీసుకొచ్చి స్టోర్ రూమ్‌లో పెట్టేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు నాగ్. ఆ బ్యాగ్ అన్నింటినీ స్టేజ్ మీదకు పంపించేయాలంటూ బిగ్‌బాస్‌కు నాగ్ సూచించారు. వెంటనే ఒకరు వచ్చి ఆ 9 సూట్‌కేసులను ఆయన ముందు పెట్టారు. తన దగ్గరకు 9 సూట్‌కేసులు వచ్చాయని.. వాళ్లు ఈరోజు ఆట నుంచి తొలగింపబడతారని నాగ్ చెప్పారు. మొత్తానికి కంటెస్టెంట్స్ గుండెల్లో దడ పుట్టించారు నాగ్. ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో నేటి రాత్రి జరగబోయే ఎపిసోడ్‌లో చూడాలి.