Munugode Bypoll : దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. చాలా సైలెంట్‌గా పనులు చక్కబెడుతోంది. ఇక్కడ అభ్యర్థిని ప్రకటించకుండా తాత్సారం చేయడం కూడా వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. అసలు మునుగోడు ఉపఎన్నికను టీఆర్ఎస్ ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదన్న సంకేతాల్ని పరోక్షంగా ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక టీఆర్ఎస్ సైలెంట్‌గా గ్రామాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలను అంచనా వేస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది.
ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేలా ఒక వైపు పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపేందుకు కసరత్తు చేస్తూనే, మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసింది. రాజ్‌గోపాల్ రాజీనామా అనంతరం ఇప్పటి వరకూ.. కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నుంచి 30 మందికి పైగా ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా స్రవంతి పేరు ఖరారు కావడంతో ఆ పార్టీ నుంచి మరికొందరు నేతలు పార్టీలో చేరే అవకాశముందని టీఆర్‌ఎస్ లెక్కలు వేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాల వారీగా ఇన్‌చార్జీలను ఇప్పటికే నియమించేసింది. అలాగే ఇక త్వరలో రెండు గ్రామాలకు ఒకరు చొప్పున బాధ్యతలను ముఖ్య నేతలకు అప్పగించనుంది.
Munugode Bypoll : వారిని ఇన్‌చార్జీలుగా రంగంలోకి దించాలని స్కెచ్..
మరో ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన వెంటనే చండూరు కేంద్రంగా టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ముగిసిన తర్వాత మునుగోడును 90 యూనిట్లుగా విభజించాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కీలక నేతలను ఇన్‌చార్జీలుగా రంగంలోకి దించాలని స్కెచ్ గీసింది. ఇప్ప టికే ఏ యూనిట్‌కు ఎవరు ఇన్‌చార్జిగా వ్యవ హరిస్తారో పేర్కొంటూ జాబితా రూపకల్పన సైం పూర్తైంది. 70 మంది ఎమ్మెల్యేలు, మరో 20 మంది ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు యూనిట్ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారు. కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థిగా.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖాయమైనట్టేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి.