CBI Tension : టీఆర్ఎస్ నేతల్లో సీబీఐ సోదాల టెన్షన్ చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకవతకల వ్యవహారంలో టీఆర్ఎస్ పెద్ద నేతలున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సహా 7 రాష్ట్రాలలో 21 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌లో కూడా సోదాలకు రెడీ ఆయినట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటి అయ్యారు. ఆ సమయంలో కేసీఆర్ వెంట పలువురు టీఆర్ఎస్ ముఖ్యలు సైతం ఉన్నారు. తాజాగా ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ నేతలంతా అలెర్ట్ అయ్యారు.
కాగా.. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో ఈ ఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీెం మనీష్ సిసోడియా నివాసంతో పాటు ఏడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. సీబీఐ విచారణను తాము స్వాగతిస్తామని.. తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని.. అందుకే ఈ విచారణలో ఎటవంటి అవకతవకలు బయటకు రావని మనీష్ సిసోడియా ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
CBI Tension : బీజేపీకి ఫేవర్‌గా తెలంగాణ..
ఈ క్రమంలోనే తమను కూడా సీబీఐ సోదాల పేరుతో వేధించవచ్చని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర పెద్దలను దుయ్యబడుతున్నారు. మరోవైపు తెలంగాణ అంతో ఇంతో బీజేపీకి ఫేవర్‌గా ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇప్పుడు మునుగోడు ఎన్నిక కూడా ఉంది. దీంతో టీఆర్ఎస్ నేతలపై సీబీఐ బాణాన్ని కేంద్ర పెద్దలు వదిలే అవకాశం ఉందని సమాచారం. పైగా ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకవతకల వ్యవహారంలో టీఆర్ఎస్ పెద్ద నేతలున్నట్టు ఆరోపణలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు మరింత భయపడుతున్నారు.