CM KCR : తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మునుగోడు ఉపఎన్నికతో ఆ పార్టీలో మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసినట్టుంది. ఇక అదే స్కీమ్‌తో ముందుకు సాగాలని చూస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని పార్టీ అధిష్టానం ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం కూడా లేదు. మరో 10 నెలల కాలం మాత్రమే ఉంది. ఈ లోపే ముందస్తు అంటూ వెళ్లి చేతులు కాల్చుకోవడం ఎందుకని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఫార్ములాను టీఆర్ఎస్ బాగా వంటబట్టించేసుకుంది. ఈ పది నెలలు అత్యంత కీలకమని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గతంలో సీఎం ఒకసారి ఇచ్చిన హామీనే తిరిగి మరోసారి కూడా స్పష్టం చేశారు. ఈ నెల 15న జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో 2023 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలను మార్చబోనని.. సిట్టింగులందరికీ సీట్లు కేటాయిస్తానని మరోసారి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగానే కేసీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలందరూ మరింత కష్టపడి పనిచేయాలని.. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఎన్నికలకు సమాయాత్తం కావాలని సూచించారు.
ఇక మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ‘పేజ్ కమిటీ’ స్ట్రాటజీని వినియోగించింది. అదే స్ట్రాటజీతో రానున్న ఎన్నికల్లోనూ ముందుకు వెళ్లనున్నట్టు సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక ఈ పేజ్ స్ట్రాటజీ ఏంటంటే.. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జ్. ఈ విధంగానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలంతా ప్రతి 100 మందికి ఒక ఇన్‌ఛార్జ్‌ను నియమించుకోవాలని సూచించారు. ఆ ఇన్‌చార్జుల పని ఏంటంటే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను హైలైట్ చేయడంతో పాటు వాటిని ప్రజలకు చేరువ చేయడం. తద్వారా ఓట్లు రాబట్టడానికి వీలుంటుందని సీఎం సూచించారు. నిజానికి ఈ ఫార్ములాను ‘పన్నా ప్రముఖ్’ పేరుతో బీజేపీ గతంలోనే అమలు చేసింది. ఇదే స్ట్రాటజీతో టీఆర్ఎస్ మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టింది.