TRS vs BJP : నేడు తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ సందర్భంగా నేడు కేంద్రం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరవుతున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో సైనిక అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించనున్నారు. సర్దార్ వల్లభాయి పటేల్, అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. జాతీయ జెండాను ఎగురవేసి, కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం బేగంపేట హరిత ప్లాజాలో బీజేపీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు.
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా.. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో దివ్యాంగులకు అమిత్ షా ఉపకరణాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లనున్నారు. సాయంత్రం పోలీస్ అకాడమీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాత్రి 7:30కు ఢిల్లీ అమిత్ షా తిరుగు ప్రయాణం కానున్నారు. 74 ఏళ్ల తరువాత హైదరాబాద్ గడ్డపై ఆయన జెండాను ఆవిష్కరించనుండటం విశేషం. 1948 సెప్టెంబర్ 17న జాతీయ జెండాను అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ ఎగురవేశారు.
TRS vs BJP : ఎవరి సభకు జనం ఎక్కువగా వస్తారు?
ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ పార్టీ సైతం నేడు తెలంగాణ వ్యాప్తంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని తలపెట్టింది. బీజేపీ కార్యక్రమాలకు పోటీగా ఉదయం 10.30 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో వేడుకలు నిర్వహించనుంది. జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఎగురవేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మంత్రులు జెండా వందనం చేయనున్నారు. ఆదివాసీ, బంజారా భవనాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. నెక్లెస్‌రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు గిరిజనులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే టీఆర్ఎస్ ఎక్కువ జన సమీకరణ చేస్తుందా? లేదంటే బీజేపీ సభకు ఎక్కువగా జనం వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. పోటాపోటీగా పెట్టిన ఈ సభలు రేపటి ఎన్నికలకు నాంది పలకబోతున్నాయి.