Bigg boss 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6.. ఏంటో ఈ సారి ఎవరికి వారే.. యమునా తీరే.. అన్నట్టుగా ఉంది వ్యవహారం. హోస్ట్ నాగార్జున ఎంత హిత బోధ చెయ్యనివ్వు గాక.. కేవలం ఆ రెండు రోజులే. రివ్యూలొద్దని వారం వారం నాగ్ చెబుతున్నా.. ఆపితే కదా. ఇక డబ్బా కొట్టడం మామూలుగా కాదు. ఈ సీజన్‌పై ఈసారి గీతూ, ఆదిరెడ్డి రివ్యూ చేశారు. ఇక ఈ రివ్యూ చూడలే.. ట్రోలర్స్‌కి కావల్సినంత పని. సూది పెట్టే సందిస్తే.. తలే పెట్టేసే ట్రోలర్స్.. ఇంతలా హిట్టూ.. హిట్టూ.. అంటే ఊరుకుంటారా? రెచ్చిపోయి మరీ ట్రోల్ చేసేస్తున్నారు.
ఆదిరెడ్డి.. గీతూ కూర్చొని ఈ సారి బిగ్ బాస్ సీజన్ 6పై రివ్యూ మొదలు పెట్టేశారు. ‘పెద్ద హిట్.. చాలా హిట్టబ్బా.. పక్కా హిట్.. హిట్ అంతే ఈ సీజన్.. అన్ని సీజన్లు హిట్టే.. సెకండ్ సీజన్ హిట్.. ఫోర్త్ సీజన్ హిట్టు.. ఇప్పుడు ఆరో సీజన్ కూడా హిట్టు’ అని చెప్పింది. దీనికి ఆదిరెడ్డి ఊరుకుంటాడా? ఆయన కూడా వంత పాడాడు. ఇన్ని సార్లు హిట్టూ.. హిట్టూ.. అంటే నెటిజన్లు నీ హిట్టు తగెలయ్య బయటకు వచ్చి చూడు.. పరిస్థితి ఎలా ఉందో అని నెటిజన్లు మండి పడుతున్నారు. నువ్వు ఉంటే హిట్ అయిపోయినట్టేనా? ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో నీకే తెలియదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Bigg boss 6 : బయటకొస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం ఖాయం
నిజానికి సినిమా భాషలో చెప్పాలంటే ఈ సీజన్ అతి పెద్ద డిజాస్టర్. రేటింగ్ దారుణం.. మధ్యలో ఆపేయలేక ఆగిపోతున్నారు కానీ లేదంటే ఎప్పుడో ఆపేసి సెట్టంతా తగలెట్టేసేవారు. లాంఛింగ్ మొదలు ఇప్పటి వరకూ రేటింగ్స్ దారుణం. రకరకాల టాస్కులు డిజైన్ చేసి ఇస్తున్నా.. చప్పున చల్లార్చేస్తున్నారు. కంటెంట్ ఇచ్చే నాథుడే లేడు. చివరకు నామినేషన్స్ అయినా ఉతికి ఆరేస్తారేమో అనుకుంటే అదీ లేదు. అసలు నామినేషన్స్ అంటే గత సీజన్స్‌లో దద్దరిల్లిపోయేవి. రెండు రోజుల పాటు ఈ నామినేషన్స్ పర్వాన్ని కొనసాగించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక్కరోజుకే దిక్కులేదు. దీనికి వీళ్ల దిక్కుమాలిన రివ్యూలు. బయటకు వస్తే మాత్రం వీళ్లకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం ఖాయం.