Munugode : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. కూల్ అండ్ కంపోజ్డ్‌గా ఇక్కడ వ్యవహారాలన్నీ టీఆర్ఎస్ చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. ఒక్క అభ్యర్థిని ఎంపిక చేయలేదు మినహా.. విజయానికి అవసరమైన అస్త్ర శస్త్రాలన్నింటినీ కూల్‌గా సమకూర్చుకుంటోంది. ఉప ఎన్నికలో పైచేయి సాధించేందుకు ఎవరి అవకాశాలను వారు వినియోగించుకోవడం పరిపాటి. అందులో అధికార పార్టీ ఒక అడుగు ముందే ఉంటుంది. నల్గొండ జిల్లాలో వామపక్షాలకు బాగానే పట్టుకుంది. సైలెంట్‌గా వారిని తమ పక్షాన చేర్చేసుకుంది. టీఆర్ఎస్ తీసుకున్న తొలి స్టెప్‌తో విజయానికి ఒక అడుగు ముందుకు వేసినట్టే అయ్యింది.
ఇక సెకండ్ స్టెప్.. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన కీలక అధికారుల బదిలీలన్నీ చకచకా సాగించింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే అధికార పార్టీ నేతలు జిల్లా స్థాయి మొదలు మండల స్థాయి వరకు తమకు అనుకూలురైన అధికారులకు ఆయా మండలాల్లో పోస్టింగ్ ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గంలో పోస్టింగ్ పొందిన వారంతా అధికార పార్టీ కీలక నేతల కోరిక మేరకు బదిలీలు చేశారనే చర్చ మునుగోడులో మొదలైంది. ఇది ఎవ్వరూ ఊహించని స్టెప్.
నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వినయ్‌కృష్ణారెడ్డి.. సుదీర్ఘకాలం పక్కనే ఉన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. అదనపు కలెక్టర్‌గా భాస్కర్‌రావు బాధ్యతలు చేపట్టారు. ఆయన జనగాం అదనపు కలెక్టర్‌గా పనిచేస్తుండగా నల్లగొండకు బదిలీ చేశారు. ఉప ఎన్నిక విధుల్లో వీరు ఇరువురు కీలక భూమిక పోషించనున్నారు. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉండగా అయిదు మండలాల తహసీల్దార్ల బదిలీలు తాజాగా జరిగిపోయాయి. రెండు మండలాల్లో సీఐలు, ఎస్‌ఐలకు స్థానచలనం కలిగింది. నాలుగు మండలాల్లో ఎంపీడీవోలను బదిలీ చేశారు. అధికారులు బదిలీలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
Munugode : ఈసీకి కంప్లైంట్ చేసేందుకు సిద్ధమవుతున్న బీజేపీ నేతలు
ఈ విషయాన్ని ఇప్పటికే ప్రశ్నించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భావించాయి. కానీ నోటిఫికేషన్ వెలువడక ముందే ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండదని మిన్నకుండిపోయారు. నియోజకవర్గం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లగానే తాజాగా పోస్టింగులు చేపట్టిన అధికారులు, వారికి అధికార పార్టీకి చెందిన నేతలతో సామాజిక, ప్రాంతీయ అనుబంధాలు, గతంలో ఆయా అధికారుల ట్రాక్ రికార్డును ఎన్నికల కమిషన్ ముందు పెట్టేందుకు వారు పూర్తి ఆధారాలతో సిద్ధమవుతున్నారు. అయితే నోటిఫికేషన్ వచ్చిన మీదట బదిలీలు నిర్వహిస్తే ఈసీ ఏమైనా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందేమో కానీ ముందే ఇంటెలిజెంట్‌గా అధికార పార్టీ తీసుకున్న స్టెప్‌కి ఈసీ అభ్యంతరం చేసే అవకాశం ఉండదని తెలుస్తోంది.