బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. హిందీ, మరాఠీ సినిమాల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న అలనాటి మేటీ నటి పద్మశ్రీ సులోచన లత్కర్ ఆదివారం కన్నుమూశారు. 94 సంవత్సరాల సులోచన లట్కర్ వృద్ధాప్యం కారణంగా ముంబైలోని సుశ్రుషా ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నటి సులోచన లట్కర్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, దిలీప్ కుమార్ వంటి ప్రముఖ నటులతో సినిమాలు చేసింది.

1928 జూలై 30న కర్ణాటకలోని ఖడక్లాత్‌లో జన్మించిన సులోచన లట్కర్ 1946లో సినీరంగంలోకి అడుగుపెట్టారు. 1959లో ‘దిల్ దేకే దేఖో’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో కూడా అరంగేట్రం చేశారు. 1995 వరకు అనేక సినిమాల్లో నటించారు. ‘గోరా ఔర్ కాలా’, ‘సంపూర్ణ రామాయణం’ ‘జీవచా శాఖ’ వంటి చిత్రాల్లో నటనకు పేరు సంపాదించారు. సులోచన ఎక్కువగా హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. దాదాపు 250కి పైగా మరాఠీ చిత్రాల్లో కనిపించారు.
నటనకు భాషాపరమైన ఎల్లలులేవని తెలియచేస్తూ ఆమె తన నటనా ప్రతిభతో అందరిని మెప్పించారు. సులోచన మృతి పట్ల పలువురు సీనియర్ నటీనటులు, సన్నిహితులు సంతాపం తెలిపారు.ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు.