గత కొంత కాలంగా టాలీవుడ్ లో నిర్మాతలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, మరో వైవు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూడకపోవడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు నిర్మాతలకి నష్టాలని మిగుల్చుతున్నాయి. కరోనాకి ముందు సినిమా మినిమమ్ ఏవరేజ్ గా ఉన్నా థియేటర్ కి వెళ్లి ప్రేక్షకులు సినిమాని చూసేవారు. ఈ కారణంగా మొదటి వారంలోనే సినిమా కోసం పెట్టిన పెట్టుబడి నిర్మాతకి వెనక్కి వచ్చేసేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేలాది స్క్రీన్స్ లో సినిమాని రిలీజ్ చేయడంతో మొదటి ఆటకి డివైడ్ టాక్ వస్తే ఇక రెండో రోజు నుంచి థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. ప్రేక్షకులు థియేటర్స్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
ఇక సినిమా రిలీజ్ అయినా మధ్యాహ్నానికి వెబ్ సైట్స్ లో రివ్యూలు, అలాగే యుట్యూబ్ లో ప్రేక్షకుడి రివ్యూలు బయటకి వచ్చేయడంతో వాటిని చూసిన తర్వాత మిగిలిన వారు రెండో రోజు సినిమాకి వెళ్తున్నారు. దీనికి టికెట్ ధరలు భారీగా పెంచడం కూడా ఒక కారణంగా మారింది. ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్లాలంటే కనీసం రెండు వేలు ఖర్చు చేయాల్సిందే. ప్రస్తుతం ప్రజల ఆదాయం కూడా తగ్గిపోవడంతో ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూసుకోవచ్చు అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ మధ్య రిలీజ్ అయిన రాధేశ్యామ్, ఆచార్య, థాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాలు నిర్మాతలకి భారీ నష్టాలని మిగిల్చాయి. ఈ నేపధ్యంలో ప్రొడ్యూసర్ గిల్డ్ గత కొంత కాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తూ సినిమా నిర్మాణ వ్యయం తగ్గించుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నారు.
ఇందులో భాగంగా సినిమా షూటింగ్స్ కూడా ఆగష్టు మొదటి వారం నుంచి నిలిపేశారు. తరువాత, హీరో, హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలని డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరితో మాట్లాడారు. అలాగే హీరోయిన్స్ తో కూడా చర్చించారు. వారు రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి నిర్మాతలకి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలు రెమ్యునరేషన్ లో ఎక్కువగా కోత పడిందని టాక్. ఇక బడ్జెట్ కంట్రోల్ కి సంబంధించి చర్చలు ముగియడంతో పాటు నిర్మాతలకి స్పష్టమైన హామీ కూడా నటుల రెమ్యునరేషన్ విషయంలో దొరకడంతో మరల షూటింగ్స్ ని తిరిగి ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా దిల్ రాజు, నిర్మాత సి కళ్యాణ్ మీడియా ముందుకి వచ్చి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 నుంచి తిరిగి షూటింగ్స్ ప్రారంభం అవుతాయని చెప్పారు.