టాలీవుడ్ లో సినిమాల బడ్జెట్ పై గత కొంతకాలంగా నిర్మాతల ప్యానల్ లో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నేతృత్వంలోనే సినిమా బడ్జెట్ విషయంలో చాలా చర్చలు జరిగాయి. ఇక హీరోలు, హీరోయిన్స్ రెమ్యునరేషన్ విషయంలో కూడా కీలక మార్పులు చేశారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే దిశగా కీలక ముందడుగు వేశారు. అందులో భాగంగా నటీనటులకి ఇచ్చే రెమ్యునరేషన్ లోనే వారికి సంబందించిన అన్ని ఖర్చులు చూసుకోవాలని, వారి అసిస్టెంట్ లకి కూడా అందులోనే ఖర్చులు భరించుకోవాలని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వీటిపై నటీనటులు అందరికి మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ విధంగా రెమ్యునరేషన్ కాకుండా సినిమా కోసం అనవసరంగా అవుతున్న ఖర్చులని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఆర్టిస్ట్ లు, రోజువారీ పనులు చేసే సినీ కార్మికులకి తీపి కబురు చెప్పారు. గత ఐదేళ్లుగా వారికి ఇచ్చే రోజువారీ వేతనాల విషయంలో పెద్దగా మార్పులు లేవు. ఈ నేపధ్యంలో ఆ మధ్య సినీ కార్మికులు అందరూ తమ వేతనాలు పెంచాలని బంద్ కి కూడా పిలుపునిచ్చారు.
24 క్రాఫ్ట్స్ లో పనిచేసే కార్మికులు రోజువారి వేతనాలు పెంచే దిశగా దిల్ రాజు నేతృత్వంలోని నిర్మాతల ప్యానల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా భారీ బడ్జెట్ సినిమాలకి ఓ రకమైన వేతనం, అలాగే చిన్న సినిమాలకి ఒక వేతనం ఉంటుందని నిర్ణయించారు. ఇక సినిమా బడ్జెట్ బట్టి అది ఏ కేటగిరీలోకి వస్తుందో నిర్ణయించి కార్మికులకి ఆ ప్రాతిపాదిక మీద చిత్ర నిర్మాత వేతనాలు ఇవ్వాలని కండిషన్స్ పెట్టాయి. త్వరలో ఈ మార్పులు అమలులోకి రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వేతన మార్పులపై కార్మికులు కూడా సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తుంది.