సినిమా ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో నటీమణులని వాడుకోవడం సాధారణంగా జరిగే పని. అయితే గతంలో ఈ విషయం అంత పెద్దది అయ్యేది కాదు. అయితే ఇప్పుడు అమ్మాయిలు మాత్రం చాలా స్పీడ్ గా ఉంటున్నారు. అవకాశాల పేరుతో వాడుకునే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులని ఆశ్రయిస్తున్నారు. మీటూ ఉద్యమం ఇచ్చిన ధైర్యంతో ముందుకి వచ్చి తమకి జరిగిన ఘోరాన్ని భయటపెడుతున్నారు. వేధింపులపై కూడా నోరు విప్పుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఒక యువ హీరో ఇదే విధంగా అరెస్ట్ అయ్యాడు.
కొత్తగా నా ప్రయాణం అనే సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన ప్రియాంత్ రావ్ జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ సినిమా సమయంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ తో ఏర్పడిన పరిచయంతో ప్రేమించినట్లు ఆమెని నమ్మించాడు. అప్పటికే అతనికి పెళ్లి అయినా కూడా తన భార్యకి విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని సదరు జూనియర్ ఆర్టిస్ట్ కి హామీ ఇచ్చి అత్యాచారం చేసినట్లు సమాచారం. తరువాత ఆమెకి ముఖం చాటేయడంతో పాటు చంపేస్తానని బెదిరించడంతో సదరు నటి పోలీసులని ఆశ్రయించింది.
అయితే అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతూ లాయర్ తో మేనేజ్ చేస్తున్న ప్రియాంత్ రావుని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మీటూ ఉద్యమం తర్వాత కూడా నటీమణులపై ఇలా లైంగిక వేధింపులకి పాల్పడే వారు ఉన్నారా అంటూ చర్చించుకుంటున్నారు. అమ్మాయిలకి ఇష్టం లేకుండా బలవంతంగా అబద్దాలు చెప్పి అత్యాచారానికి పాల్పడే ఎవరినైనా కఠినంగా శిక్షించాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.