AP Assembly : ఏపీలో రెండు కీలక అంశాలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని అంటూ రైతులు ఒకవైపు మహాపాదయాత్ర చేస్తుండగా… మరోవైపు 3 రాజధానుల అంశమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం శాసనసభ సమావేశాలకు సిద్ధమైంది. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు సాగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉండొచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తున్నా.. సభలో ప్రత్యేక చర్చ కచ్చితంగా ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తంగా 25 అంశాలపై చర్చించాలని అధికార పక్షం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగనుంది. తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశం నిర్వహించనున్నారు. దివంగత సభ్యులు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులవర్తి నారాయణమూర్తి, జేఆర్ పుష్పరాజ్, నల్లమిల్లి మూలారెడ్డిల మృతిపట్ల సభలో సంతాపతీర్మానాన్ని సభాపతి తమ్మినేని సీతారాం ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో రెవెన్యూశాఖ 4 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
AP Assembly : నిర్విఘ్నంగా ‘అమరావతి టూ అరసవల్లి’ మహాపాదయాత్ర..
ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నాలుగు బిల్లుల్లో 3 బిల్లులు చట్ట సవరణకు, ఒక బిల్లు రద్దుకు సంబంధించినవి. ‘ఆటో మ్యుటేషన్’ విధానానికి అనుగుణంగా రికార్డ్స్ ఆఫ్ రైట్-1971 చట్టాన్ని సవరిస్తారు. ప్రస్తుత మ్యుటేషన్ విధానంలో కొనుగోలు చేసిన వ్యక్తి పేరు 30 రోజుల్లో వెబ్‌ల్యాండ్‌లో నమోదు కావట్లేదు. కొత్త సవరణతో సబ్‌డివిజన్ జరిగిన తర్వాతే రిజిస్టర్ చేస్తారు. దీనివల్ల ఆటోమ్యుటేషన్ సులువవుతుంది. భూమి కొన్నవారి పేరు వెంటనే వెబ్‌ల్యాండ్‌లో నమోదవుతుంది. మొత్తానికి మూడు రాజధానుల బిల్లు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ‘అమరావతి టూ అరసవల్లి’ మహాపాదయాత్ర… హైకోర్టు అనుమతితో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈ పాదయాత్ర 60 రోజులపాటు సాగి నవంబరు 11న అరసవల్లిలో ముగుస్తుంది.