Tirumala : తిరుమల తిరుపతి లోని ఆనంద నిలయం పునరుద్ధరించడంతోపాటు , ఆలయ గర్భగుడిలోని గోపురంపైన కొత్త బంగారు తాపడం పనులను చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలె నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు పనుల్లో ఆటకం కలుగకుండా భక్తులు స్వామివారి దర్శనంలో ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై టీటీడి తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలోనే స్వామివారి దర్శనంపైన భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే తిరుమలలో వేంకటేశ్వర స్వామి దర్శనం నిలిపివేతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ పేర్కొంది. భక్తులు దర్శన విధానంలోనూ ఎలాంటి మార్పు ఉండబోదని టీటీడి చైర్మన్ పేర్కొన్నారు.

టిటిడి ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ట్రస్ట్ బోర్డు తన చివరి సమావేశంలో ఆనంద నిలయంలో బంగారు తాపడంపై మాత్రమే నిర్ణయం తీసుకుందని భక్తుల దర్శనంపై కాదని పేర్కొంది. ఫిబ్రవరి 23న బాలాలయం నిర్మాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ భక్తుల దర్శన విధానంలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. దీనితో స్వామివారి భక్తులు ఊపిరిపీల్చుకున్నట్లయ్యింది.

ఇదే నేపథ్యంలో భక్తులు యథావిధిగా పీఠాధిపతిని దర్శనం చేసుకోగలిగినప్పుడు బాలాలయం నిర్మాణం ఎందుకు అవసరం అని అడిగినప్పుడు, ఫిబ్రవరి మొదటి వారంలో మరోసారి సమావేశం కానున్న ట్రస్టుబోర్డు దీనిపై స్పష‌్టతను ఇస్తుందని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు . ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు బంగారు తాపడం చేసే పనుల్లో దర్శన సమస్యలను ఎలా నిర్వహించాలనే దానిపై ఆగమ నిపుణులు, అర్చకులతో టీటీడీ చర్చిస్తుందని అధికార ప్రతినిధి తెలిపారు.