పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చాలా చురుకుగా దూసుకుపోతున్నారు. 2024లో అధికారమే లక్ష్యంగా తన వ్యూహాలతో ముందుకి కదులుతున్నారు. రెగ్యులర్ గా తన పొలిటికల్ కార్యక్రమాలు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. తరుచుగా పార్టీ నాయకులతో చర్చిస్తూ వారిని కూడా నియోజకవర్గాల వారీగా సమాయత్తం చేస్తున్నారు. గతంలో జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గొంతు మాత్రమే వినిపించేది. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా నాయకులు ప్రజా పోరాటాలు చేస్తున్నారు. అలాగే అధికార పార్టీ వైఫల్యాలపై విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించే వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వరుస పర్యటనల తర్వాత ప్రజాబలం పెరిగింది అనే సాంకేతాలు రావడంతో క్యాడర్ లో కూడా ఉత్సాహం పెరిగింది.
దీంతో వారు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ని హత్య చేసే కుట్ర జరుగుతుందనే ప్రచారం వినిపిస్తుంది. వైజాగ్ పర్యటన తర్వాత కొంత మంది వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని చంపేస్తామని బెదిరిస్తూ వీడియోలు చేశారు. వారిపై జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేసిన పోలీసులు యాక్షన్ తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కారుని ఫాలో చేస్తూ కొంత మంది అనుమానాస్పదంగా అతన్ని వెంటాడుతున్నారని నాదెండ్ల మనోహర్ మీడియాతో చెప్పారు. దీనిపై ఒక లేఖని కూడా విడుదల చేశారు.
అమరావతి క్యాంపు ఆఫీస్, హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కొన్ని కార్లు అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది అని చెప్పారు. అలాగే కొంత మంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరకి వెళ్లి సెక్యూరిటీతో గొడవ పడ్డారని కూడా టాక్ వినిపిస్తుంది. వారిపై ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అనే నేమ్ ప్లేట్ తో ఉన్న కారు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరిగిందని, అందులో కొంత మంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీతో గొడవకి దిగినట్లు తెలుస్తుంది. దీనిపై జనసేన నాయకులు, కార్యకర్తలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కి ఏమైనా జరిగితే జరగబోయే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత కల్పించాలని ప్రధానమంత్రికి ట్విట్టర్ ద్వారా రిక్వస్ట్ పెడుతున్నారు. మరి ఈ వ్యవహారం ఏ స్థాయి వరకు వెళ్తుందనేది చూడాలి.