Congress Party : ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తమ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహిస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి శశిథరూర్, మల్లిఖార్జున ఖర్గేలు పోటీ పడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం 137 ఏళ్లలో ఇది ఆరో సారి కావడం గమనార్హం. పార్టీ పెద్దలంతా వరుసగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు రాహుల్ భారత్ జోడో యాత్రలో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఆయన కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బళ్లారిలో రాహుల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అన్ని రాష్ట్రాల్లోనూ కీలక నేతలంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నియోజకవర్గానికి ఇద్దరు కీలక నేతలు చొప్పున ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. తెలంగాణలోనూ పార్టీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ జనగామ నియోజకవర్గంలో పొన్నాలతో పాటు మరో నేతకు ఓటు హక్కు కల్పించారు. అయితే రాత్రికి రాత్రి ఏమైందో కానీ ఆ వ్యక్తి స్థానంలో మరో వ్యక్తికి ఓటు హక్కు కల్పించారు. దీనిపై పొన్నాల ఫైర్ అయ్యారు. తనతో పాటు వచ్చిన వ్యక్తికి కూడా ఓటు హక్కు కల్పించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. ఓటింగ్ పూర్తవగానే అన్ని రాష్ట్రాల్లోని బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తీసుకెళతారు. అక్కడ అక్టోబర్ 19 ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీయేతర నాయకుడు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఇది ఆరవ సారి. గతంలో ఏకంగా సోనియా గాంధీపైనే జితేంద్ర ప్రసాద్ పోటీ చేశారు. కానీ సోనియాయే విజయం సాధించారు. అనంతరం 20 ఏళ్ల పాటు పదవిలో కొనసాగి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కాలం పనిచేసిన అధ్యక్షురాలుగా చెప్పుకోవచ్చు. 2017 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అధ్యక్షుడయ్యారు. అనంతరం ఆయన కూడా రాజీనామా చేశారు.