Nagarjuna : సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్తను తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడకు తరలి వచ్చారు. అభిమానులు పెద్ద ఎత్తున కృష్ణ పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. పెద్ద ఎత్తున జనం రాకతో అక్కడ తోపులాట జరిగి పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి కేవలం వేళ్లపై లెక్కపెట్టగలిగినంత మంది మాత్రమే రాలేదు. ఒక్క నాగార్జున మినహా రాని వారంతా ఇక్కడ అందుబాటులో లేని వారే కావడం గమనార్హం.
అయితే ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చినా కూడా హైదరాబాద్‌లో ఉండి కూడా కృష్ణను కడసారి చూసేందుకు, నివాళులు అర్పించేందుకు నాగార్జున మాత్రం రాలేదు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కృష్ణ, నాగార్జున కలిసి రెండు, మూడు సినిమాలు చేశారు. వీరిద్దరికీ మంచి అనుబంధం ఉంది. అయినా కూడా నాగార్జున రాకపోవడంపై పెద్ద చర్చే నడుస్తోంది. అభిమానులు సైతం ఏమైనా కారణముందా? నాగ్ కావాలనే రాలేదా? అనే విషయమై ఆరాలు తీయడం మొదలు పెట్టారు. దీనిపై తాజాగా ఓ సీనియర్ జర్నలిస్ట్ స్పందించి ఈ చర్చకు తెర దించేందుకు యత్నించారు.
ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ నాగార్జున హాజరు కాకపోవడంపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గతంలో అంటే ఈవీవీ, దాసరి నారాయణరావు వంటి ప్రముఖులు మరణించినప్పుడు సైతం నాగ్ అక్కడికి వెళ్లలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కొందరు తమకు అత్యంత సన్నిహితులైన వారి మరణాన్ని జీర్ణించుకోలేరని.. వారిని నిర్జీవంగా చూడలేరని.. అలాంటి వారిలో నాగార్జున ఒకరన్నారు. అంత్యక్రియలకు వెళ్లలేకపోయినా పలు సందర్భాల్లో ఆ తర్వాత వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారని గుర్తు చేశారు. కానీ కృష్ణ మరణించి దాదాపు వారం అవుతున్నా కూడా ఇప్పటికీ నాగ్ పరామర్శకు కూడా వెళ్లకపోవడం గమనార్హం.