Baby Mummy : ఓ చిన్నారి.. హాయిగా నిద్రపోతున్నట్టుగా ఉంది. నీట్‌గా దువ్విన జుట్టు.. చూడటానికే అందంగా ఉందా పాప. కానీ ఆ పాప ఉన్న చెక్కపెట్టెను చూస్తే కానీ ఎవరికీ అర్థం కాదు.. ఆ పాప మరణించిందని.. షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ చిన్నారి మరణించింది 1920లో. అవును మీరు చదువుతున్నది నిజమే. చిన్నారి మమ్మీ. ఇంతవరకూ మనం చూసిన మమ్మీలు.. చాలా వరకూ డీ కంపోజ్ అయిన స్థితిలోనే కనిపించాయి. కానీ చనిపోయినప్పుడు ఎలా ఉన్నారో.. ఇన్నేళ్ల తర్వాత కూడా అలానే యథాతథంగా ఉండటం అసాథ్యం. కానీ ఈ చిన్నారి మమ్మీ మాత్రం చెక్కుచెదరలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటే.. ఈ చిన్నారి మమ్మీ ప్రపంచంలోనే అందమైన మమ్మీగా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ చిన్నారి తన పుట్టినరోజు నాడే మరణించింది.
రోసాలియా లాంబార్డో అనే రెండేళ్ల చిన్నారి డిసెంబర్ 2, 1918న జన్మించింది. అదే సమయంలో స్పానిష్ ఫ్లూ ప్రబలింది. 1920 వరకూ ఎంతో మందిని ఈ ఫ్లూ పొట్టన బెట్టుకుంది. రోసాలియాను కూడా ఆమె పుట్టినరోజు నాడే అంటే డిసెంబర్ 2, 1920న ఈ ఫ్లూ పొట్టనబెట్టుకుంది. ఆ సమయంలో చిన్నారి మృతదేహానికి లేపనాలు పూసి చెక్కు చెదరకుండా అత్యంత జాగ్రత్తగా ఉత్తర సిసిలీలో పలెర్మోలోని కాపుచిన్ కాటాకాంబ్స్ అనే చోట భద్రపరచారు. వందేళ్ల తర్వాత కూడా ఆ ఆ చిన్నారి మృతదేహం ఆమె చనిపోయినప్పుడూ ఎలాగా ఉందో అలానే ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. రోసాలియా మృతదేహాన్ని నైట్రోజన్‌తో నిండిన గాజు శవ పేటికలో భద్రపరిచారు. ఇపుడు ఈ చిన్నారి బేబీ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
Baby Mummy : మెదడు మాత్రం 50 శాతం తగ్గిపోయిందట..
ఈ చిన్నారి మమ్మీ ప్రస్తుతం పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ కాపుచిన్ కాటాకాంబ్స్ అనేది దక్షిణ ఇటలీలో ఉండే అతి పెద్ద మమ్మీల పరిశోధన కేంద్రం లేదా మమ్మీలను భద్రపరిచే భూగర్భ శ్మశాన వాటిక. ఇందులో దాదాపు ఎనిమిది వేల మమ్మీలు ఉన్నాయి. అయితే ఈ చిన్నారి మమ్మీని భద్రపరిచినంత జాగ్రత్తగా మిగిలిన వాటిని భద్రపరచలేదు. చిన్నారి మమ్మీ రాగి జుట్టుతో.. చర్మం రంగు మారకుండా ఏదో నిద్రపోతున్నట్లుగా ఉంటుంది. అయితే చాలామంది అదొక నకిలీ మమ్మీ అని, మైపపు మద్ద అంటూ రకరకాల పుకార్లు సృష్టించారు.కానీ ఆ చిన్నారి శరీరం పై చేసిన పరిశోధనల్లో శరీరం, ఎముకలు, అవయవాలు ఏ మాత్రం చెక్కు చెదరలేదని,కేవలం మెదడు మాత్రమే ఉండాల్సిన పరిమాణం నుంచి 50% తగ్గిపోయిందని ఆర్కియాలజిస్ట్‌లు నిర్థారించారు. కానీ కొంతమంది శాస్తవేత్తలు మాత్రం ఈ మమ్మీ శవపేటికలో ఉండటం వల్ల ఇరు పక్కల ఉండే గాజు విండోలు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ కలిగిస్తున్నాయని.. తద్వారా ఆ మమ్మీ చెక్కుచెదరకుండా ఉన్నట్లు కనిపించేలా చేస్తున్నాయని, పగటి పూట వేరేలా ఉంటుందని చెబుతున్నారు.