Viral News: అంతకు ముందు మనకు తెలిసిన కుక్కల బ్రీడ్స్ మహా అయితే 3 – 4. కానీ ఇప్పుడు సవాలక్ష. గోల్డెన్ రిట్రీవర్, పమేరియన్, షిట్జూ.. అదీ ఇదీ.. అయ్యబాబోయ్ ఎన్ని రకాలో.. అవి చూడటానికి కూడా ఒంటినిండా బొచ్చుతో చాలా ముద్దొచ్చేస్తాయి. అప్పట్లో కాపలాకి పెంచుకునేవారు కాస్తా.. ఇప్పుడు కేవలం స్టేటస్ సింబల్‌గా పెంచుకుంటున్నారు. ఇక ఇప్పటి రకరకాల బ్రీడ్ డాగ్స్‌ను చూస్తుంటే.. ఏది కుక్కో.. ఏది వేరే జంతువో అర్ధం కాదు.. ఎందుకంటే.. ఒక్కో బ్రీడ్ ఒక్కో ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది.
ఇక ఓ ఫ్యామిలీ కుక్కనుకుని ఏకంగా నక్క పిల్లను తెచ్చి పెంచుకుంది. అది రయ్ రయ్ మంటూ ఇల్లంతా చెక్కెర్లు కొడుతుండటంతో దానికి ముద్దుగా ‘రన్ రన్’ అని పేరు పెట్టుకుంది. ఒంటి నిండా బొచ్చుతో ఎంతో అందంగా ఉన్న ఆ నక్క పిల్లను చూసి తెగ మురిసి పోయింది. ఆరు నెలల తర్వాత కానీ అసలు విషయం తెలియలేదు. అప్పడికే జరగాల్సిన డామేజ్ అంతా జరిగిపోయింది. ఇది దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో జరిగింది. ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. వాళ్ల తప్పేంలేదులెండి. పెట్ షాపు వాడు ఏదో బ్రీడ్ అని చెప్పి నక్కను వాళ్లకు అంటగట్టాడు.
13 డాలర్లు పెట్టి మరీ ఆ నక్క పిల్ల అదేనండి కుక్కపిల్ల అనుకుని కొనుక్కొచ్చారు. ఒంటినిండా జూలుతో అందంగా కనిపించడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. 6 నెలల తర్వాత ఆ ప్రాంతంలో కోళ్లు, గినియా పందులు, బాతులు అన్నీ మాయమవుతుండటంతో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చింది. తీరా ‘రన్ రన్’ వాటిని మాయం చేస్తోందని గ్రహించారు. వారింటిపై దాడికి వెళ్లారు. వాళ్లకు అర్ధం కాలేదు. అసలు దీనికింత మాంసాహారం అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందనేది. మొత్తానికి ఇరుగు పొరుగు వారికి పెద్ద మొత్తంలో డబ్బు కట్టారు. ఓ రోజు రాత్రి అది నక్కలా ఊల పెట్టడంతో షాక్ అయ్యారు. అప్పటికి కానీ అది నక్క అని తెలియలేదు. వెంటనే తేరుకుని దాన్ని ఫారెస్ట్ అధికారులకు ఇచ్చేయాలనుకున్నారు. కానీ అదే ఇంటి నుంచి తప్పించుకుని పారిపోయింది. దాన్ని అటవీ అధికారులు పట్టుకుని బంధించారు.