Munugode bypoll : మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగిసింది. ఇక ఎన్నికలే తరువాయి. దీనిలో భాగంగా పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. కాగా.. మొత్తంగా 130 మంది నామినేషన్లు దాఖలు చేయగా 83 మంది ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం పోటీలో 47 మంది అభ్యర్థులు మిగిలారు. మునుగోడు ఉపఎన్నికలో స్వతంత్రులు సైతం పెద్ద ఎత్తున పోటీ చేశారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్ల ఉపసంహరణకు మంత్రుల కృషే కారణమని చెప్పాలి.
అయితే నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువమంది ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన ఇబ్బంది పడినవారే కావడం గమనార్హం. దీంతో మంత్రి జగదీశ్ రెడ్డి రంగంలోకి దిగి.. వారందరికీ నచ్చజెప్పి నామినేషన్ల ఉపసంహరణకు ఒప్పించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 26 మంది ఇతర జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం. 33 మంది స్వతంత్రులు పోటీ చేస్తే వారిలో 26 మంది నల్గొండ జిల్లాయేతరులు కావడం విశేషం. కాగా.. ఇంత మంది పోటీ చేయడంతో ఈవీఎంలు సైతం పెద్ద సంఖ్యలో అవసరపడనున్నాయి.
ఒక్కొక్క ఈవీఎంకు మొత్తంగా 17 బటన్స్ ఉంటాయి. మరి అభ్యర్థులు 47 మంది ఉన్నారు. కాబట్టి మూడు పోలింగ్ బూత్‌కు మూడు ఈవీఎంల చొప్పున అవసరపడతాయి. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్లన్నింటికీ సరిపడా.. ఈవీఎంలు కావాల్సి ఉంటుంది. మరోవైపు ఓటర్లకు తమ అభ్యర్థి మూడు ఈవీఎంలలో ఎక్కడున్నాడో వెదుక్కోవడం అతి పెద్ద టాస్క్. రాష్ట్రంలో ఎక్కువ మంది అభ్యర్థులతో జరుగుతున్న మూడో ఎన్నిక ఇదే కావడం గమనార్హం. ఇంతకుముందు 1996లో మొదటిసారిగా నల్లగొండ లోక్‌సభ ఎన్నికల్లో 480 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆ తరువాత 2019లో నిజామాబాద్ ఎన్నికే కావడం గమనార్హం.