రాష్ట్ర ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి, దెబ్బలు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్యనే దూరం ఆయన పంచకర్ల రమేష్ బాబు నిన్న మంగళగరిలోని కార్యాలయంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి రమేష్ బాబును జనసేనలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ.. పంచకర్ల రమేష్ బాబుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక గ్రామ, వార్డు వాలంటీర్లపై మాట్లాడినందుకు తనను ప్రాసిక్యూట్ చేయమని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని కళ్యాణ్ చెప్పారు. ఒక్కో వాలంటీర్‌కు ఇస్తున్న రోజు వారీ జీతం 164 రూపాయలు అని వెల్లడించారు. డిగ్రీ చదివిన వారికి ఉపాధి హామీ పథకం కంటే తక్కువ వేతనం చెల్లిస్తున్నారని తప్పుబట్టారు.
ఇక, వాలంటీర్లతో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. 23 అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించి ఎక్కడికి పంపుతున్నారని ప్రశ్నించారు. అలాగే వ్యక్తిగత సమాచారం భద్రపరుచుకోవడం చాలా ముఖ్యమన్నారు. సమాచార సేకరణపై ప్రభుత్వ విధి విధానాలు ఏంటని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో వాలంటీర్లు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సేకరించిన సమాచారం ఏటా ఒక కంపెనీకి ఇస్తున్నారని.. సమాచార చౌర్యంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రెడ్ క్రాస్ వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తారని పేర్కొన్నారు.
తనను ప్రాసిక్యూట్ చేయమని జీవో ఇచ్చారని.. జగన్ ప్రభుత్వాన్ని కిందకు దించేది ఈ జీవోనే అని అన్నారు. అలాగే, మైనింగ్ అక్రమాల సంగతి కూడా చూస్తామని తెలిపారు. కేసులకు భయపడే వ్యక్తిని అయితే పార్టీ ఎందుకు పెడతానని ప్రశ్నించారు. ఎక్కడికి వచ్చి అయినా తనను విచారించుకోవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన మన అనే తేడా లేదని కళ్యాణ్ తెలిపారు.
వైసీపీ అధికారంలోకి వస్తే కొండలతో సహా దోచేస్తారని ముందే చెప్పానని పేర్కొన్నారు. తాను చెప్పింది రుషికొండ విషయంలో జరిగిందని వివరించారు. ఇక, రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని.. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కళ్యాణ్ తెలిపారు