Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ మరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. జేమ్స్ బాండ్‌గా.. నట శేఖరుడిగా ఇండస్ట్రీలో ఆయన వేసుకున్న ముద్ర ఎవరూ చెరిపేయలేనిది. అత్యంత సౌమ్యుడిగానూ ఆయన పేరు తెచ్చుకున్నారు. నేడు సూపర్ స్టార్ అంత్యక్రియలు మహా ప్రస్థానంలో జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆయన చూసేందుకు ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చింది. ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ దిగ్గజాలన్నీ తరలివచ్చాయి. పద్మాలయ స్టూడియోస్ ప్రాంతమంతా ఇసుకేస్తే రాలనంత జనం.
ఒకానొక దశలో పోలీసులకు సైతం అలవి కాలేదు. జన సందోహాన్ని కంట్రోల్ చేయలేక లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. తమ అభిమాన నటుడిని కడాసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. బారికేడ్లు తోసుకుని మరీ అభిమానులు ఒక్కసారిగా లోపలికి వెళ్లారు. దీంతో జనాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జికి దిగారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ కృష్ణ పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మహేష్ బాబు సహా కుటుంబ సభ్యులందరినీ ఓదార్చారు.
నిన్ననే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇక తెలంగాణ గవర్నర్‌తమిళిసై నివాళులర్పించారు. అలాగే ఏపీ మంత్రి రోజా, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులంతా కృష్ణ పార్థీవదేహానికి నివాళులర్పించారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి వారు, వీరు అని లేకుండా మొత్తం తరలివచ్చి నివాళులు అర్పించింది. మరికాసేపట్లో కృష్ణ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.