Varasudu : వారసుడు సినిమా వివాదం రోజురోజుకీ ముదురుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తమిళ్ హీరో ఇళయ దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళ్‌లో వారీస్‌గా విడుదల కానుంది. అయితే వచ్చిన చిక్కల్లా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడమే. సంక్రాంతి కానుకగా ఈ సినిమా అటు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. ఇటు నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ విడుదల కానున్నాయి.
అయితే ఈ రెండు చిత్రాలను టార్గెట్ చేసేందుకు వారసుడు సిద్ధమవుతున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఈ చిత్ర నిర్మాత అయిన దిల్ రాజు.. అటు మెగాస్టార్.. అటు బాలయ్యలకు థియేటర్లు పెద్దగా దక్కకుండా చేస్తున్నారట. దీంతో గత కొద్ది రోజులుగా చిరు, బాలయ్య ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు. గతంలో దిల్ రాజు మాట్లాడిన వీడియోలను వెలికి తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంలోకి తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ సైతం ఎంటర్ అయ్యింది.
సంక్రాంతికి తెలుగు సినిమాలకే ప్రాధాన్యమివ్వాలని.. డబ్బింగ్ సినిమాలకు అంతగా ప్రాధాన్యమివ్వొద్దని కోరుతూ లేఖ రాసింది. ఈ లేఖపై తమిళ దర్శకులు మండిపడుతున్నారు. తెలుగు సినిమాలను తమ దగ్గర అదరిస్తుంటే తమిళ్ సినిమాలను అపడం ఏమిటంటూ మండిపడతున్నారు. ఇకపై తమ దగ్గర కూడా తెలుగు సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీనిపై 22న తమిళ్ నిర్మాతలు భేటీ కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా వారసుడు వివాదంపై తమిళ నిర్మాతల మండలి చర్చించనుంది. ఈ భేటీలో తమిళ నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.