Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఆరవ వారం రసవత్తరంగా సాగుతోంది. ఈసారి నామినేషన్స్ టాస్క్ మాంచి రసవత్తరంగా హాట్ హాట్‌గా జరిగింది. కానీ నేడు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ చాలా ఎమోషనల్‌గా సాగుతోంది. ఆదివారం మొత్తం ఎలిమినేషన్ రచ్చ.. నేడు ఏదో ఆశ కల్పించినట్టే కల్పించి కంటెస్టెంట్స్ చేత కంటతడి పెట్టిస్తున్నాడు బిగ్‌బాస్. హౌస్‌మేట్స్‌కు రీచార్జ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్.
మనసుకు ఎంతో దగ్గరైన వాళ్లకు ఇన్నిరోజులు దూరంగా ఉండటం మామూలు విషయం కాదని… అందుకే, ఈవారం ఇంటిసభ్యులందరికీ వారి బ్యాటరీలను రీచార్జ్ చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో ఈ ఆటలో ముందుకు కొనసాగే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు చెప్పాడు బిగ్‌బాస్. ‘బ్యాటరీ రీచార్జ్’ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో హౌస్‌మేట్స్ అంతా ఫుల్ ఖుషీ అయిపోయారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ మా విడుదల చేసింది. అందులో భాగంగా తొలుత శ్రీహాన్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు.
నచ్చిన వ్యక్తుల నుంచి వీడియో కాల్, ఆడియో మెసేజ్ లేదంటే ఫుడ్.. వీటిలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకోమన్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ వీడియో కాల్ చేస్తే.. 35 శాతం, ఆడియో మెసేజ్‌కి 30 శాతం, ఫుడ్‌కి 15 శాతం బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందనే కండిషన్ పెట్టాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్ తనకు ఏదీ వద్దని చెప్పగా.. మూడింటిలో ఒకటి ఎంచుకోకపోతే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, వాటిని ఇంటిసభ్యులందరూ ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. దీంతో శ్రీహాన్ తక్కువ డిశ్చార్జ్ ఉన్న ఫుడ్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీహాన్ కంటతడి పెట్టుకున్నాడు. ఆ తర్వాత వెళ్లిన వారి కారణంగా మొత్తంగా 50 శాతం బ్యాటరీ డిశ్చార్జి అయిపోయింది. దీంతో మా అమ్మకు ఈ రాత్రి నిద్ర పట్టదంటూ శ్రీ సత్య కన్నీటి పర్యంతమైంది.